మహారాష్ట్ర: ఉద్దవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేకు కరోనా పాజిటివ్

By Siva KodatiFirst Published Mar 20, 2021, 8:01 PM IST
Highlights

ఉద్దవ్ థాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరేకి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శనివారం నాడు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని.. పాజిటివ్‌గా తేలిందని ఆదిత్య వెల్లడించారు.

మహారాష్ట్ర మరోసారి దేశంలో కరోనా హాట్ స్పాట్‌గా మారుతోంది. గడిచిన కొన్ని రోజులుగా అక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో 65 శాతం అక్కడే నమోదవుతున్నాయి.

అటు దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ పరిస్ధితి భయానకంగా వుంది. కేసుల తీవ్రత దృష్ట్యా ఇక్కడ త్వరలోనే మరోసారి లాక్‌డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ పలువురు ప్రముఖులు సైతం వైరస్ బారినపడుతున్నారు.

తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య థాకరేకి పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా శనివారం నాడు ట్విటర్ ద్వారా వెల్లడించారు. తనలో కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్నానని.. పాజిటివ్‌గా తేలిందని ఆదిత్య వెల్లడించారు.

ఇటీవల తనను కలసిన వారందరూ కరోనా టెస్టు చేయించుకోవాలని సూచిస్తున్నా. ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదిత్య థాకరే ప్రస్తుతం పర్యాటక, పర్యావరణ మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

ఇక మహారాష్ట్రలో కొత్తగా 13601 కరోనా కేసులు నమోదవ్వగా... 58 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం.. మహారాష్ట్రలో 1,67,637 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి.

అటు ఆసియాలోని అతిపెద్ద మురికివాడ ధారావిలోనూ మహమ్మారి మరోసారి విశ్వరూపం దాల్చుతోంది. ఫిబ్రవరితో పోల్చితే మార్చిలో పాజిటివ్ కేసుల సంఖ్య 62 శాతం పెరిగినట్టు అధికారులు వెల్లడించారు.

ఫిబ్రవరిలో ఇక్కడ మొత్తం 168 కేసులు నమోదు కాగా.. మార్చి నెలలో నిన్నటి వరకు 272 మంది కరోనా బారిన పడ్డారు. 2.5 చదరపు కిలోమీటర్ల అతి చిన్న విస్తీర్ణంలోని వున్న ధారవిలో కొవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

అయితే కరోనా విజృంభించిన తొలి నాళ్లకంటే ఇప్పుడు దానిని ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధంగా ఉన్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ధారావిలో నమోదవుతున్న కేసులు అన్నీ ఒకేచోట నమోదైనవి కావని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ మురికివాడలో యాక్టివ్ కేసులు 72 వరకు ఉన్నాయి. 

click me!