ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా దత్తాత్రేయ హోసబలె

By Siva KodatiFirst Published Mar 20, 2021, 5:03 PM IST
Highlights

భారతీయ జనతా పార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి (సర్ కార్యవహ్)గా దత్తాత్రేయ హోసబలె శనివారంనాడు ఎన్నికయ్యారు. 2009 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సహ్ కార్య‌వహ్)గా ఉన్నారు

భారతీయ జనతా పార్టీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శి (సర్ కార్యవహ్)గా దత్తాత్రేయ హోసబలె శనివారంనాడు ఎన్నికయ్యారు. 2009 నుంచి ఆయన ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సహ్ కార్య‌వహ్)గా ఉన్నారు.

బెంగళూరులో రెండ్రోజులుగా జరుగుతున్న అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) సమావేశాల్లో సర్ కార్యవహ్ ఎన్నిక జరిగింది. ఇప్పటి వరకు సర్ కార్యవహ్‌గా పనిచేసిన 73 ఏళ్ల సురేష్ 'భయ్యాజీ' జోషి స్థానంలో దత్తాత్రేయ హోసబలె ఎన్నికయ్యారు..

సర్‌ సంఘ్‌చాలక్ (ఆర్ఎస్ఎస్ చీఫ్) తర్వాత నెంబర్ 2గా సర్‌ కార్యవహ్ ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తూ వుంటారు. ప్రస్తుతం ఆర్ఎస్‌ఎస్ చీఫ్‌గా మోహన్ భగవత్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఏబీపీఎస్ వార్షిక సమావేశం ప్రతి ఏడాది దేశంలోని వేర్వేరు చోట్ల జరుగుతుంటుంది. మూడో ఏడాది మాత్రం ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయమైన నాగపూర్‌లో జరగడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడే సర్‌కార్యవహ్ ఎన్నిక జరుగుతుంది. అయితే, ఈసారి మహారాష్ట్రలో కోవిడ్ కేసుల తీవ్రత అధికంగా వున్నందున బెంగళూరులో రెండ్రోజుల పాటు సమావేశం ఏర్పాటు చేశారు.

కర్ణాటక శివమొగ్గలోని సోరబ్‌లో దత్తాత్రేయ హోసబలె జన్మించారు. 65 ఏళ్ల హోసబలె ఇంగ్లీషు లిటరేచర్‌లో పీజీ చేశారు. 1968లో సంఘ్‌లో చేరిన ఆయన... తొలుత విద్యార్ధి విభాగమైన ఏబీవీపీతో అనుంబంధం కొనసాగించిన దత్తాత్రేయ, ఆర్ఎస్ఎస్ ఆర్గనైజర్‌గా వ్యవహరించారు

click me!