రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్.. గవర్నర్ కీలక ఆదేశం.. ముంబై చేరుకోనున్న షిండే వర్గం..

By Sumanth KanukulaFirst Published Jun 29, 2022, 9:45 AM IST
Highlights

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కోరారు. గురువారం (జూన్ 30) సాయంత్రం 5 గంటల్లోపు సభలో బలపరీక్ష పూర్తి చేయాలని ఆదేశించారు.

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేను గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ కోరారు. గురువారం (జూన్ 30) సాయంత్రం 5 గంటల్లోపు సభలో బలపరీక్ష పూర్తి చేయాలని ఆదేశించారు. శాసనసభ సమావేశాన్ని వీడియోలో రికార్డు చేయాలని గవర్నర్ చెప్పారు. ఉద్దవ్ ఠాక్రే మెజారిటీని నిరూపించుకునేందుకు గురువారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అసెంబ్లీ కార్యదర్శి రాజేంద్ర భగవత్‌కు లేఖ రాశారు. రేపు సమావేశం కానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏకైక అజెండా ఫ్లోర్ టెస్ట్ అని గవర్నర్ కోష్యారీ చెప్పారు.

‘‘రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ దృశ్యం చాలా కలతపెట్టే విధంగా ఉన్నాయి. 39 మంది ఎమ్మెల్యేలు మహా వికాస్ అఘాడి ప్రభుత్వం నుండి వైదొలగాలని ఆకాంక్షించారు. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమ మద్దతు ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్టుగా ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ప్రతిపక్ష నాయకుడు కూడా నన్ను కలిశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని నాకు వివరించి.. ఫ్లోర్ టెస్ట్ కోసం అడిగారు. ఫ్లోర్ టెస్ట్ ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. స్వతంత్ర ఏజెన్సీ ద్వారా విధానసభ సెక్రటేరియట్ ద్వారా కార్యకలాపాలు కెమెరాలో రికార్డ్ చేయబడతాయి’’ అని కోష్యారి పేర్కొన్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో అస్సాం గౌహతిలోని ఓ ఫైవ్ స్టార్‌ హోటల్‌లో బస చేస్తున్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు తిరిగి ముంబై వచ్చేందుకు సిద్దమయ్యారు. సేన రెబల్ క్యాంపుకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే కొందరు ఎమ్మెల్యేలతో కలిసి గౌహతిలోని ప్రఖ్యాత కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో జరిగే ఫ్లోర్ టెస్ట్ కోసం రేపు ముంబైకు వెళ్తున్నట్టుగా  చెప్పారు. రేపు ముంబై చేరుకుని.. బలపరీక్షలో పాల్గొంటామని తెలిపారు. 

అంతకుముందు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజీపీ నేత దేవంద్ర ఫడ్నవీస్.. గవర్నర్ కోష్యారీతో స‌మావేశ‌మ‌య్యారు. మంగళవారం దేశ రాజ‌ధాని ఢిల్లీలో బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా, బీజేపీ ముఖ్యనేతలతో భేటీ అయిన త‌ర్వాత ఫ‌డ్న‌వీస్ ముంబైకి చేరుకున్నారు. ముంబై చేరుకున్న తర్వాత ఫ‌డ్న‌వీస్ రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి.. గ‌వ‌ర్న‌ర్ కోష్యారీతో భేటీ అయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష (ఫ్లోర్ టెస్ట్) నిర్వహించాలని గవర్నర్‌ను కోరారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ కు లేఖ అందజేశారు. ఫడ్నవీస్‌ వెంట ఎమ్మెల్యే చంద్రకాంత్‌పాటిల్‌, గిరీష్‌ మహాజన్‌, ఇతర నేతలు కూడా ఉన్నారు. 

ఇదిలా ఉంటే.. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం 287 మంది సభ్యులు ఉన్నారు. ఒక్క స్థానం ఖాళీగా ఉంది. ప్రస్తుతం అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 144గా ఉంది. రాజకీయ సంక్షోభం నెలకొనక ముందు శివసేన, కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల కూటమికి 152 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రస్తుతం తనకు దాదాపు 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని.. వారిలో 40 మంది శివసేనకు చెందిన వారేనని ఏక్‌నాథ్ షిండే చెప్పారు. 

click me!