పూజా చవాన్ కేసు... మంత్రి పదవికి సంజయ్ రాజీనామా, స్పందించిన ఉద్ధవ్

Siva Kodati |  
Published : Feb 28, 2021, 08:56 PM IST
పూజా చవాన్ కేసు... మంత్రి పదవికి సంజయ్ రాజీనామా, స్పందించిన ఉద్ధవ్

సారాంశం

మంత్రి పదవికి శివసేన నేత సంజయ్ రాథోడ్ రాజీనామా చేయడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే స్పందించారు. ప్రతి ఒక్కరికి సమాన ప్రాతిపదిక న్యాయం అందాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు

మంత్రి పదవికి శివసేన నేత సంజయ్ రాథోడ్ రాజీనామా చేయడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే స్పందించారు. ప్రతి ఒక్కరికి సమాన ప్రాతిపదిక న్యాయం అందాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

తమ నిజాయితీకి ఇదే నిదర్శనమని.. ఈ రోజు సంజయ్ రాథోడ్ తన రాజీనామాను అందజేశారని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోందని ఉద్ధవ్ థాకరే అన్నారు.

పూజా చవాన్ అనే టిక్‌టాక్ స్టార్ మరణంలో ప్రమేయం ఉందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సంజయ్ రాథోడ్ ఆదివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు పంపించారు.

అనంతరం సంజయ్ మాట్లాడుతూ రాజీనామాను ముఖ్యమంత్రికి సమర్పించానని ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాలు అసెంబ్లీని అడ్డుకోవాలని చూస్తున్నాయని సంజయ్ ఆరోపించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇది సరి కాదని ఉద్దేశ్యంతో తనకు తానుగా రాజీనామా నిర్ణయం తీసుకున్నానని రాథోడ్ స్పష్టం చేశారు. చవాన్ కేసులో నిష్పాక్షితంగా విచారణ జరగాలన్నదే తన కోరిక అని సంజయ్ పేర్కొన్నారు.

కాగా, పూణెకు చెందిన పూజా చవాన్ అనే టిక్‌టాక్ స్టార్.. ఫిబ్రవరి 8న భవనంపై నుంచి కింద పడి చనిపోయారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నారా లేక ప్రమాదవశాత్తూ పడిపోయారా, లేక ఎవరైనా తోసేశారా అన్నది మిస్టరీగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పూణె పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరోవైపు పూజా చవాన్ మరణం మహారాష్ట్రలో సంచలనం సృష్టించింది. రాథోడ్ రాజీనామా చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో మార్చి 1న అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే సంజయ్ రాథోడ్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Ukrainian Woman Lidia Lakshmi Slams YouTuber Anvesh Over Comments Hindu Gods | Asianet News Telugu
అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?