
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్థవ్ థాక్రేకు కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. శివసేన అధికార పార్టీ పేరు, ఎన్నికల గుర్తు అయిన విల్లు -బాణంలు సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ వర్గానికి చెందుతాయని ఈసీ శుక్రవారం స్పష్టం చేసింది. రాజకీయ పార్టీల రాజ్యాంగం ప్రకారం.. ఆఫీస్ బేరర్ల పోస్టులకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలని పేర్కొంది. షిండే వర్గానికి పెద్ద ఎత్తున సభ్యుల మద్ధతు వున్నందున శివసేన అధికా పార్టీ పేరు, విల్లు బాణం గుర్తులు తిరుగుబాటు గ్రూప్‌కే చెందుతాయని స్పష్టం చేసింది. దీనిపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం హర్షం వ్యక్తం చేసింది. తమదే నిజమైన శివసేన పార్టీ అని రుజువైందని.. ఉద్ధవ్ వెంట వున్న మిగిలిన శివసేన నేతలు, కార్యకర్తలు త్వరలోనే తమ వర్గంలో చేరుతున్నారని షిండే గ్రూప్‌కు చెందిన శీతల్ మహాత్రే వెల్లడించారు. మరి ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్ ఎలాంటి స్టెప్ తీసుకుంటారో వేచి చూడాలి.
కాగా... శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ మద్ధతుతో ఏక్‌నాథ్ షిండే సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాతి నుంచి అసలైన శివసేన తమదేనంటూ ఆయన ఏకంగా కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే, కేవలం పేరుకే ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అనీ, అన్ని నిర్ణయాలు దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. అలాగే, రానున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత శివసేన రెబల్ గ్రూప్ కనబడకుండా పోతుందని ఉద్ధవ్ థాక్రే వర్గం పేర్కొంటోంది.