మహారాష్ట్రలో బీజేపీకి భారీ షాక్.. కాషాయ కంచుకోటలో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ..

Published : Mar 02, 2023, 03:45 PM IST
మహారాష్ట్రలో బీజేపీకి భారీ షాక్.. కాషాయ కంచుకోటలో పాగా వేసిన కాంగ్రెస్ పార్టీ..

సారాంశం

మహారాష్ట్రలో అధికార బీజేపీ-షిండే కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో కస్బా పేట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేకపోయింది.

మహారాష్ట్రలో అధికార బీజేపీ-షిండే కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో కస్బా పేట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోలేకపోయింది. అయితే అక్కడ గత 28 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంటూ వచ్చింది. తాజా ఉప ఎన్నికలో మాత్రం అక్కడ బీజేపీ అభ్యర్థి హేమంత్ రసానేపై కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర ధంగేకర్ విజయం సాధించారు. రవీంద్రకు 10 వేలకు పైగా మెజారిటీ  దక్కింది. ఈ ఉపఎన్నికలో  రవీంద్ర ధంగేకర్‌కు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ మరియు శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)లతో కూడిన మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) మద్దతుగా నిలిచాయి. 

ఇక, కస్బా పేట్ నియోజకవర్గంలో 28 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. పూణే నుంచి ప్రస్తుత బీజేపీ ఎంపీగా ఉన్న గిరీష్ బాపట్.. 1995 నుంచి 2019 వరకు ఐదుసార్లు కస్బా పేట్‌ స్థానం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ముక్తా తిలక్ ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూ 2022 డిసెంబర్‌లో మరణించారు. దీంతో కస్బా పేట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

గత ఏడాది జూన్‌లో ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో మహారాష్ట్రలో అధికార మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే. బీజేపీ-ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు  ప్రత్యర్థి మహా వికాస్ అఘాడి మధ్య మొదటి ప్రత్యక్ష పోటీ కావడంతో కస్బాలో కాంగ్రెస్ విజయం ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు. ‘‘ఇది ప్రజల విజయం. నేను నామినేషన్ దాఖలు  చేసిన రోజే కస్బా పేట్ నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించాలని నిర్ణయించుకున్నారు’’ అని రవీంద్ర ధంగేకర్ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి హేమంత్.. తాను ఈ ఎన్నికల్లో విఫలమయ్యానని, ఎక్కడ తప్పు జరిగిందో ఆత్మపరిశీలన చేసుకుంటానని అన్నారు. గతంలో ఈ స్థానంలో ముక్కోణపు పోటీ ఉండేదని.. ఈసారి బీజేపీ-కాంగ్రెస్‌ మధ్యే హోరాహోరీ పోరు సాగిందని ఆయన అన్నారు.

ఇంతటి ‘‘చారిత్రక’’ విజయాన్ని పార్టీకి, ఎంవీఏకు అందించినందుకు కస్బా పేట ఓటర్లకు కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోహన్ జోషి అభినందనలు తెలిపారు. ఇది ఐక్యంగా పోరాడిన ఎంవీఏ కార్యకర్తలందరి విజయమని అన్నారు. 

ఇక, మహారాష్ట్రలోని పూణె జిల్లాలోని కస్బా, చించ్‌వాడ్ స్థానాలకు ఇటీవల ఉపఎన్నికలు జరిగాయి. ఈ ఉపఎన్నికలు ఎంవీఏతో పాటు రాష్ట్రంలోని అధికార షిండే-బీజేపీ కూటమికి ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వంటి పెద్ద నేతలు వారి వారి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. 

చించ్‌వాడ్ విషయానికి వస్తే.. ఇక్కడ 2019లో బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్ పాండురంగ్ జగ్తాప్ విజయం సాధించారు. లక్ష్మణ్ మృతితో ఇక్కడ  ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిగా లక్ష్మణ్ సతీమణి అశ్విని జగ్తాప్‌ను బరిలో దింపింది. ఈ స్థానంలో అశ్విని జగ్తాప్, ఎన్సీపీ అభ్యర్థి నానా కేట్, స్వతంత్ర అభ్యర్థి రాహుల్ కలాటే ప్రధాన పోటీదారులుగా నిలిచారు. అయితే ఈ స్థానంలో అశ్విని విజయం సాధించడంతో.. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకున్నట్టు అయింది. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?