
నాగ్ పూర్ : మహారాష్ట్ర, గడ్చిరౌలిలో జరిగిన పోలీసుల ఎన్ కౌంటర్ లో 13 మంది మావోయిస్టులు మరణించారు. శుక్రవారం ఉదయం తూర్పు విదర్భ గడ్చిరోలిలోని పేడి-కోట్మి మధ్యనున్న అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.
సి-60 కమాండోలు ఓ గ్రామసమీపంలో క్యాంపు అయి ఉన్నారన్న సమాచారాన్ని అందుకుని దాడిచేశారు. మావోయిస్టుల నుంచి కొన్ని ఆయుధాలు, తుపాకులు, విప్లవసాహిత్యం, నిత్యావసరాల లాంటివి ఎన్ కౌంటర్ ప్రాంతంలో దొరికాయి.
కసనూర్ మావోయిస్టుల దళం ఇక్కడ గ్రామస్తులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. టెండు లీవ్స్ కాంట్రాక్ట్ కు సంబంధించి గ్రామస్తులతో చర్చించాలని నిర్ణయించింది. ఈ మేరకు పోలీసులకు సమాచారం అందింది.
గ్రామస్తులతో మావోయిస్టులు సమావేశం అయ్యారు. తెల్లవారు జామున అక్కడ క్యాంపు ఎత్తేసి వెళ్లాలని వాళ్ల ఆలోచన. ఇంతలోనే అర్థరాత్రి పూట గడ్చిరోలి, అహేరి ప్రాన్హితా హెడ్ క్వార్టర్స్ నుంచి కమాండోలు క్యాంపు మీద విరుచుకుపడ్డారు.
అయితే డిఐజి, నక్సల్ రేంజ్ సందీప్ పాటిల్ మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ పగటిపూట జరిగిందని తెలిపారు.
"అడవిలో మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో మేము అంతకుముందు రోజే ఆపరేషన్ ప్రారంభించాం. ఇప్పటివరకు 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరైనా ఉన్నారా అని వెతుకుతున్నాం.." అని ఆయన చెప్పారు.