
Maharashtra Cabinet: ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మారుస్తున్నట్లు మహారాష్ట్ర నూతన సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. కేబినెట్ సమావేశంలో ఔరంగాబాద్‌ను సంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మార్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. అలాగే నవీ ముంబై ఎయిర్‌పోర్ట్ పేరును డిబి పాటిల్ ఎయిర్‌పోర్ట్‌గా మార్చారు. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. ఆ ప్రక్రియ చట్టవిరుద్ధమని పేర్కొంటూ.. ఏక్నాథ్ షిండే మంత్రివర్గం మళ్లీ ఆమోదించింది.
మహారాష్ట్రలోని ఔరంగాబాద్, ఉస్మానాబాద్ నగరాల పేర్లను మార్చుతామని, గతంలోనే మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అయితే.. ఏక్‌నాథ్ షిండేతో పాటు దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తున్న సమయంలో ఈ ప్రకటన వెలువడింది. కొన్ని గంటల తర్వాత ఉద్ధవ్ ఠాక్రే కూడా రాజీనామా చేశారు. అందుకే ఏక్నాథ్ షిండే.. సీఎం అయిన తర్వాత స్వయంగా కేబినెట్ సమావేశం పెట్టి.. ఈ నిర్ణయం తీసుకున్నారని, గతంలో తీసుకున్న నిర్ణయం చెల్లదని తేల్చిచెప్పారు.
ఈ నిర్ణయం ఉద్ధవ్ ఠాక్రే తీసుకోలేదని, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే చాలా దశాబ్దాల క్రితమే ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారనీ, ఔరంగాబాద్ నగరానికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు పెట్టారు.
తిరుగుబాటుకు షిండే సమాధానం
శివసేన రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు తర్వాత.. షిండే మహారాష్ట్రలో బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తొలుత ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతాడని భావించినా.. ఎవరూ ఊహించని విధంగా.. షిండే.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. పార్టీని, కార్యకర్తలను కాపాడేందుకే తాను శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేశానన్నారు. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వంలో శివసేన అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఏమీ సాధించలేదన్నారు. నగర పంచాయతీ ఎన్నికల్లో నాలుగో స్థానంలో నిలిచామనీ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా తిరుగుబాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు ఆమోదించారని షిండే పేర్కొన్నారు.