ఇష్టపూర్వకంగానే...: కమల్ నాథ్ పై రెబెల్ ఎమ్మెల్యే ఎదురుదాడి

By telugu teamFirst Published Mar 17, 2020, 10:43 AM IST
Highlights

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పై రెబెల్ ఎమ్మెల్యేలు ఎదురు దాడికి దిగారు. తమను ఎవరూ నిర్బంధించలేదని, ఇష్టపూర్వకంగానే బెంగళూరు వచ్చామని వారు చెప్పారు. తమకు కమల్ నాథ్ నుంచి ముప్పు ఉందని ఆరోపించారు.

బెంగళూరు: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పై తిరుగుబాటు శాసనసభ్యులు ఎదురుదాడికి దిగారు. వారు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. మంగళవారం బలపరీక్షకు తాను సిద్ధంగానే ఉన్నానని కమల్ నాథ్ ప్రకటించారు. మంగళవారం బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సోమవారం ఆదేశించారు. దాంతో తాను సిద్ధంగానే ఉన్నట్లు కమల్ నాథ్ చెప్పారు. 

ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కమల్ నాథ్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తమను ఎవరూ బంధించలేదని, తమకు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన భద్రత కల్పించలేదని వారు చెప్పారు. కమల్ నాథ్ ప్రభుత్వం నుంచి తమకు ముప్పు ఉందని వారన్నిారు. తాము స్వేచ్ఛగా సంచరిస్తున్నట్లు తెలిపారు. 

తాము తమ తమ నియోజకవర్గం ప్రజలతో మాట్లాడుతున్నట్లు వారు తెలిపారు. తాము ఇష్టపూర్వకంగానే బెంగళూరు వచ్చినట్లు చెప్పారు. స్వచ్ఛందంగానే తాము రాజీనామా చేశామని, తమపై ఎవరి ఒత్తిడీ లేదని అన్నారు. కమల్ నాథ్ ప్రభుత్వం పట్ల తాము అసంతృప్తి ఉన్నట్లు చెప్పారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి కమల్ నాథ్ సమయం కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.

కమల్ నాథ్ పై జ్యోతిరాదిత్య వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. జ్యోతిరాదిత్య సింథియా బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. దాంతో కమల్ నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది.

తమను నిర్బంధించినట్లు కాంగ్రెసు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని చెప్పారు. తమ మొబైల్స్ లాక్కున్నారని, తమను కర్ణాటక ప్రభుత్వం నిర్బంధించిందని కాంగ్రెసు చేస్తోందని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని వారన్నారు. తాము నిస్సహాయ స్థితిలోనే రాజీనామాలు చేసినట్లు తెలిపారు. అయితే, బిజెపిలో చేరుతారా అనే ప్రశ్నకు మాత్రం వారు జవాబు దాటేశారు. 

కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కరోనా కూడా కాపాడలేదని బిజెపి నేత శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. పూర్తిగా మెజారిటీ కోల్పోవడం వల్లనే మంగళవారం కమల్ నాథ్ బలపరీక్షను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు. 22 మంది శాసన సభ్యులు కమల్ నాథ్ పై తిరుగుబాటు ప్రటించారు.

click me!