ఆరేళ్ల బాలిక‌ను చిదిమేసిన ట్ర‌క్కు.. ఆగ్ర‌హంతో వాహ‌నానికి నిప్పుపెట్టి, డ్రైవర్‌ను మంటల్లోకి తోసేసిన జనం

By Rajesh KFirst Published May 14, 2022, 10:53 PM IST
Highlights

Madhya Pradesh Road Accident: ప్రమాదంలో బాలిక మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవర్‌ను కొట్టి.. ఆ వాహనానికి నిప్పంటి ఆ డ్రైవ‌ర్ ను మంట‌ల్లో తోసివేశారు. చిక్సిత పొందుతూ ఆ వ్య‌క్తి చ‌నిపోయాడు. ఈ ఘ‌ట‌న మధ్యప్ర‌దేశ్ లోని అలీరాజ్‌పూర్‌లో చోటు చేసుకుంది.
 

Road Accident: మ‌ధ్యప్ర‌దేశ్ దారుణం జ‌రిగింది. ఒక వాహనం ఆరేళ్ల బాలికను కొట్ట‌డంతో .. ఆ చిన్నారి అక్క‌డిక్క‌డే మ‌ర‌ణించింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు డ్రైవ‌ర్ చిత‌క‌బాదారు. అంత‌టిలో ఆగ‌కుండా.. ఆ వాహనానికి నిప్పు పెట్టారు. డ్రైవర్‌ను కొట్టి మంటల్లోకి తోసేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుదూ చనిపోయాడు. ఈ ఘ‌ట‌న మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లా చంద్రశేఖర్ ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్జార్ కూడలిలో జరిగింది
 
వివ‌రాల్లోకెళ్తే..  శుక్రవారం రాత్రి బర్ఝర్ క్రాసింగ్‌ వద్ద ఒక పికప్ వాహనం ఆరేళ్ల కంజిపై దూసుకెళ్లగా ఆ బాలిక మరణించింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు ఆ వాహనానికి నిప్పుపెట్టారు. 43 ఏళ్ల డ్రైవర్‌ మగన్ సింగ్‌ను దారుణంగా కొట్టారు. మంటల్లో కాలుతున్న వాహనం మీదకు అతడ్ని తోసేశారు. 

చంద్రశేఖర్ ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ విజయ్ దేవరా తెలిపిన వివరాల ప్రకారం.. కతివాడ నుంచి భాబ్రా వైపు వెళ్తున్న జీపు మార్గమధ్యంలో బర్జార్ ఫేట్ సమీపంలో 6 ఏళ్ల బాలికను ఢీ కొట్టింది. దీంతోఆ  బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన తర్వాత అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఆ జీపు డ్రైవర్‌ను విచ‌క్ష‌ణ ర‌హితంగా కొట్టారు. అంత‌టితో ఆగ‌కుండా.  ఆ జీపును ధ్వంసం చేసి..  నిప్పంటించారు.

అనంత‌రం ఆ డ్రైవ‌ర్ ను ఆ మంట‌ల‌లో తొసివేశారు. దీంతో అక్కడే ఉన్న మరికొందరు అత‌డిని మంట‌ల్లో నుంచి బ‌య‌ట‌కు లాగి.. మంటలను ఆర్పారు. దీంతో తీవ్ర గాయ‌ప‌డిన ఆ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం తొలుత‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌నగర్‌లోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం గుజరాత్‌లోని దాహోద్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం అతడు మరణించాడు.

మరోవైపు ఈ ఘటనపై అలీరాజ్‌పూర్ పోలీసులు స్పందించారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించారు. నిందితులను గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

click me!