
కుక్క కాటుతో గేదె చనిపోవడం.. ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. గేదె మరణవార్తను తెలసుకున్న జనాలు సమీపంలోని ఆస్పత్రి వద్ద రేబీస్ వ్యాక్సిన్ (Rabies Shots) కోసం బారులు తీరారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) గ్వాలియర్ సమీపంలోని ఒక చిన్న పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్వాలియర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న డబ్రా హెల్త్ సెంటర్‌కు భారీగా జనాలు తరలివచ్చారు. తమకు రేబీస్ టీకా వేయాల్సిందిగా వారు వైద్యులను అభ్యర్థించారు. దీంతో అసలు ఏమైందని అక్కడి సిబ్బంది ఆరా తీశారు. దీంతో పిచ్చి కుక్కు కాటు వేయడం వల్ల గేదె, దాని దూడ చనిపోయిందని తెలిసింది.
అయితే గేదె చనిపోవడానికి ముందు రోజు దాని పాలతో చేసిన పదార్థాలను గ్రామంలో జరిగిన ఒక మతపరమైన వేడుకల్లో పంపిణీ చేశారు. మరుసటి రోజు ఈ విషయం వెలుగులోకి రావడంతో జనాలు ఆందోళన చెందారు. మరోవైపు గేదె పాలు సరఫరా చేయబడిన ఇళ్లలోని ప్రజలు కూడా ఆందోళనకు గురయ్యారు. దీంతో తమకు రేబీస్ సోకుతుందేమోనని భయంతో ప్రజలు ఆస్పత్రికి పరుగులు తీసినట్టుగా స్థానికంగా నివాసం ఉండే ఓ వ్యక్తి చెప్పారు. జనాలు పెద్ద ఎత్తున హెల్త్ సెంటర్‌కు తరలివెళ్లడంతో.. అక్కడ ఉన్న కొద్దిపాటి రేబీస్ టీకా నిల్వులు అయిపోయాయి.
ప్రజలు భయాందోళనలను నియంత్రించడానికి గ్వాలియర్ మెడికల్ కాలేజీ, ఇన్ఫెక్షియస్ డిసీజ్ సెంటర్ అధికారులు డాబ్రాకు వెళ్లారు. సివిల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ పాఠక్ మాట్లాడుతూ.. తాము వ్యాక్సిన్‌ల వినియోగం విషయంలో ప్రపంచ ఆరోగ్య మార్గదర్శకాలు పాటిస్తున్నామని చెప్పారు. అయితే ఇలాంటి సందర్భాల్లో వ్యాక్సిన్‌ల వినియోగాన్ని డబ్ల్యూహెచ్‌వో సూచించలేదన్నారు. దాదాపు 1,000 మంది ప్రజలు యాంటీ రేబీస్ టీకా పొందాలని అనుకున్నారని.. కానీ కొందరికి మాత్రమే వ్యాక్సిన్ లభించిందని చెప్పారు.
డబ్రా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అరవింద్ శర్మ కూడా మాట్లాడుతూ.. 2018లో WHO మార్గదర్శకాలను జారీ చేసిందని.. rabid animals నుంచి పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల వైరస్ సంక్రమించదని తెలిపారు. అయిప్పటికీ కొందరు గ్రామస్తులు వైద్యులు మాట వినిపించుకోలేదు. దాదాపు 150 మంది యాంటీ రేబీస్ టీకా పొందారు. కొంతమంది ప్రభుత్వాసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకోగా, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించారని స్థానిక నివాసి ఒకరు తెలిపారు.