
Former BJP MP Makhan Singh Solanki Joins Congress: ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గట్టి షాక్ తగిలింది. బీజేపీ మాజీ ఎంపి మఖన్ సింగ్ సోలంకి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. బర్వానీలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఇదివరకు 2009లో ఖర్గోన్-బర్వానీ స్థానం నుంచి సోలంకి లోక్ సభ సభ్యుడిగా ఎన్నియ్యారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.. మఖాన్ సింగ్ సోలంకిని పార్టీలోకి స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆయన తమ పార్టీలో చేరిన తర్వాత మఖన్ సింగ్ సోలంకి తన స్పష్టమైన ఉద్దేశాలను వ్యక్తం చేశారని తెలిపారు. బీజేపీ ఆయనను ఎప్పుడూ గౌరవించలేదనీ, తన జీవితంలో ఎన్నడూ ఎన్నికల్లో ఓడిపోని వ్యక్తిని బీజేపీ ఎన్నడూ ప్రశంసించకపోవడం బాధాకరమన్నారు. బీజేపీ ఎప్పుడూ మైనారిటీలను పట్టించుకోలేదనీ, వారిని ఎప్పుడూ అగౌరవపరిచిందని దిగ్విజయ్ సింగ్ అన్నారు.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారిని బీజేపీ అగౌరవపరుస్తుందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ దార్శనికతతో దేశంలోని మైనారిటీలను కాంగ్రెస్ ఎల్లప్పుడూ గౌరవించిందన్నారు. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడగా, 230 మంది సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 114 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. కమల్ నాథ్ నేతృత్వంలో కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, కానీ 2020 మార్చిలో జ్యోతిరాదిత్య సింధియాకు విధేయులైన పలువురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి బీజేపీలో చేరడంతో అది పడిపోయింది. దీంతో శివరాజ్ సింగ్ చౌహాన్ తిరిగి ముఖ్యమంత్రిగా ఉండటానికి మార్గం సుగమం చేసింది.
మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్న కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు హోరాహోరీ పోరు సాగిస్తున్నాయి. బీజేపీ అవినీతికి పాల్పడుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, '40% కమిషన్' ప్రభుత్వంగా అభివర్ణించగా, బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ రాష్ట్రంలో మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసింది.