మధ్యప్రదేశ్ ఎన్నికలు.. సీఎం చౌహాన్‌పై రామాయణ్‌ నటుడిని బరిలో నిలిపిన కాంగ్రెస్..

Published : Oct 15, 2023, 12:16 PM IST
మధ్యప్రదేశ్ ఎన్నికలు.. సీఎం చౌహాన్‌పై రామాయణ్‌ నటుడిని బరిలో నిలిపిన కాంగ్రెస్..

సారాంశం

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ ప్రముఖ నటుడు విక్రమ్ మస్తాల్‌ను రంగంలోకి దింపింది.

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ ప్రముఖ నటుడు విక్రమ్ మస్తాల్‌ను రంగంలోకి దింపింది. బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్నికల బరిలో నిలుస్తుండగా.. అదే స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా విక్రమ్‌ బరిలో నిలవనున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసింది. ఇందులో నటుడు విక్రమ్‌కు చోటు కల్పించింది. విక్రమ్ ఈ ఏడాది జూలైలో  కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. 

విక్రమ్‌ను బుద్ని నియోజకవర్గం నుంచి బరిలో దింపింది. ఇక, 2008లో వచ్చిన రామాయణ్‌లో హనుమంతుడిగా విక్రమ్ మస్తాల్‌ నటించారు. ఈ పాత్రకు గానూ ఆయన విశేష గుర్తింపు సొంతం చేసుకున్నారు. 

ఇక, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలోని ఇతర పేర్లను పరిశీలిస్తే.. చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ కమల్ నాథ్‌ బరిలో నిలవనున్నారు. మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ తనయుడు జైవర్ధన్ సింగ్ రఘీగథ్ స్థానం నుంచి బరిలోకి దిగారు. గత కమల్‌నాథ్‌ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా పనిచేశారు. ఇక, ఈ జాబితాలో జనరల్ కేటగిరీ నుంచి 47 మంది, ఓబీసీ కేటగిరీ నుంచి 39 మంది, ఎస్టీ కేటగిరీ నుంచి 30 మంది, ఎస్సీ కేటగిరీ నుంచి 22 మంది, ముస్లిం ఒకరు, 19 మంది మహిళలు ఉన్నారు. అభ్యర్థుల్లో 65 మంది 50 ఏళ్లలోపు వారే.

మరోవైపు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ బుద్ని స్థానం నుంచి పోటీ చేయనున్నట్టుగా బీజేపీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. బుద్ని అసెంబ్లీ స్థానం శివరాజ్ చౌహాన్‌కు కంచుకోటగా ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికలలో చౌహాన్ 58,999 ఓట్ల మెజారిటీ బుద్ని నుంచి విజయం సాధించారు. ఇక, మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడించనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ