లూథియానా కోర్టు పేలుడు కేసులో ఎన్‌ఐఏ దాడులు.. రూ.10 లక్షల నగదు స్వాధీనం..

By Rajesh KarampooriFirst Published Jan 20, 2023, 11:25 PM IST
Highlights

లూథియానా కోర్టు బాంబు పేలుడు కేసులో పంజాబ్‌లోని రెండు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ దాడులు నిర్వహించింది. ఈ సమయంలో రూ.10 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, అభ్యంతరకర అంశాలతో కూడిన డైరీని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. 2021 డిసెంబర్ 23న జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 6 మంది గాయపడ్డారు.
 

లూథియానా కోర్టు పేలుడు కేసులో ఎన్ఐఏ దాడులు: లూథియానా కోర్టు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) శుక్రవారం నాడు పంజాబ్‌లోని రెండు ప్రదేశాలలో దాడులు చేసింది. ఈ దాడిలో రూ. 10,16,000 నగదు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, అభ్యంతరకర అంశాలతో కూడిన డైరీని స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. పంజాబ్‌లోని శ్రీ ముక్త్‌సర్‌ సాహిబ్‌, గురుదాస్‌పూర్‌ జిల్లాల్లో ఎన్‌ఐఏ ఈ దాడులు చేసింది. వాస్తవానికి ఈ ఘటన 23 డిసెంబర్ 2021న లూథియానా కోర్టులో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ కేసులో ఎన్ఐఏ 2022 డిసెంబర్ 02న ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేసింది.

ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్‌ అరెస్టు 

ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్ ఈ ఘటనకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఘటన తర్వాత అతను మలేషియాకు పారిపోయాడు. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి రాగానే ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్‌ఐఏ పట్టుకుంది. ఉగ్రవాది హర్‌ప్రీత్ సింగ్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మాట్లాడుతూ.. అతను పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్నేషనల్ సిక్కు యూత్ ఫెడరేషన్ (ఐఎస్‌వైఎఫ్) అధినేత ఖలిస్తానీ లఖ్‌బీర్ సింగ్ రోడే సహచరుడని పేర్కొంది.  హర్‌ప్రీత్ సింగ్‌పై రూ. 10 లక్షల రివార్డు ప్రకటించారని, అతనిపై ప్రత్యేక NIA కోర్టు నుండి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయబడిందని, లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయబడిందని NIA తెలియజేసింది. లూథియానా కోర్టు బాంబు పేలుడుకు లఖ్‌బీర్ సింగ్ రోడ్‌తో కలిసి హర్‌ప్రీత్ కుట్ర పన్నారు. లఖ్‌బీర్‌ సూచనల మేరకు హర్‌ప్రీత్‌ పాకిస్థాన్‌ నుంచి ఐఈడీ డెలివరీని ఏర్పాటు చేశాడు. కోర్టులో పేలుడు కోసం పాకిస్థాన్ నుంచి ఐఈడీని పంపించారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. లూథియానాలోని పాత కోర్టు కాంప్లెక్స్‌లోని రెండవ అంతస్తులో పేలుడు జరిగింది.పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లు కూడా దద్దరిల్లాయి. దీంతో పంజాబ్‌ వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. పేలుడు గుర్తులు ఇప్పటికీ కోర్టులో కనిపిస్తున్నాయి. ఎన్‌ఐఏ విచారణ కారణంగా ఇటుక ఇటుక కూడా తరలించలేదు. 

click me!