ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమ నిరాకరించిందని యువతి గొంతుకోసి, అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపైనా

Siva Kodati |  
Published : Feb 15, 2022, 10:36 PM IST
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రేమ నిరాకరించిందని యువతి గొంతుకోసి, అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపైనా

సారాంశం

గుజరాత్‌లోని సూరత్‌లో దారుణం చోటు చేసుకుంది.  ఓ అమ్మాయి తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి ఉన్మాదిగా మారాడు. ఎంత బతిమలాడినా తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో కత్తితో ప్రియురాలి గొంతుకోసి చంపేశాడు.

ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని (Valentines Day) జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న వేళ .. సరిగ్గా వాలంటైన్స్ డేకు రెండు రోజుల ముందు ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ అమ్మాయి తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఉన్మాదిగా మారాడు. ఎంత బతిమలాడినా తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో కత్తితో ప్రియురాలి గొంతుకోసి చంపేశాడు. అంతేకాదు .. కూతురిని కాపాడుకోవడానికి అడ్డొచ్చిన ఆ యువతి కుటుంబసభ్యులపైన కూడా కత్తితో దాడికి పాల్పడ్డాడు. చివరకు ఆత్మహత్యకు యత్నించి.. పోలీసులకు దొరికిపోయాడు. గుజరాత్ (gujarat) రాష్ట్రం​ సూరత్​లో (surat) ఈ దారుణం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఫెనిల్ ​గోయాని(22), గ్రీష్మ వెకారియా(21)లు సూరత్ లో ఒకే స్కూల్ లో చదువుకున్నారు. అప్పటి నుంచి ఒకరికొకరు పరిచయం వుంది.. పైగా స్నేహితులు కూడా. అయితే కొద్దిరోజుల నుంచి తన ప్రేమను అంగీకరించాలని గ్రీష్మను వేధించడం మొదలుపెట్టాడు గోయాని. అందుకు గ్రీష్మ ఒప్పుకోలేదు. అటు వీరిద్దరి ప్రేమ, పెళ్లికి ఆమె కుటుంబసభ్యులు సైతం అంగీకరించలేదు. అయినప్పటికీ గోయాని తన తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో గ్రీష్మ తన కుటుంబసభ్యులకు తన గోడు వెళ్లబోసుకుంది. దీంతో కామ్​రేజ్​ ప్రాంతంలో శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో గ్రీష్మ తమ్ముడు తమ మేనమామ సుభాష్‌ భాయ్‌ని తీసుకుని వెళ్లి గోయానిని మందలించాడు. ఇకపై గ్రీష్మ వెంటపడితే పరిణామాలు తీవ్రంగా వుంటాయని వారిద్దరూ హెచ్చరించారు. 

అయినప్పటికీ గోయాని వినలేదు.. ఆగ్రహంతో తన చేతిలో ఉన్న కత్తితో ఆతనిని పొడిచాడు. దీంతో సోదరుడితో కలిసి తప్పించుకునేందుకు గ్రీష్మ ప్రయత్నించింది. కానీ గ్రీష్మను వెంటాడి పట్టుకున్న ఆ ఉన్మాది.. కత్తితో ఆమె గొంతు కోసేశాడు. దీంతో గ్రీష్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అంతటితో ఆగకుండా గ్రీష్మ సోదరుడిని సైతం గాయపరిచాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకుందామని చెప్పి.. కత్తితో తన చేతిని కోసుకుని, విషం తాగేందుకు యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. గోయానిని అరెస్ట్​ చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోయాని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు గ్రీష్మ తండ్రి నందలాల్ డైమండ్ వ్యాపారి. గత ఎనిమిది నెలలుగా ఆయన దక్షిణాఫ్రికాలో ఉంటున్నారు. సమాచారం అందుకున్న వెంటనే నందలాల్ భారత్ కు బయల్దేరారు.

గడిచిన ఏడాదిగా ప్రేమ పేరుతో వేధిస్తున్నప్పటికీ.. గ్రీష్మ కుటుంబం తమకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు చెబుతున్నారు. గ్రీష్మ, గోయానీలు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి వివాదాన్ని పరిష్కరించుకోవాలని భావించినట్లు అధికారులు తెలిపారు. కానీ ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకుంది. హోంమంత్రి హర్ష్ సంఘ్ స్వస్థలమైన సూరత్ నేరాలకు అడ్డాగా మారిపోయిందని.. కాంగ్రెస్ నేత అమిత్ చావ్డా వ్యాఖ్యానించారు. యువతి హత్య నేపథ్యంలో హోంమంత్రి రాజీనామా చేయాలని అమిత్ డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !