
ఇటీవలి కాలంలో ప్రజల్లో హెల్త్, శరీర పుష్టిపై బాగా అవగాహన పెరిగింది. చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా జిమ్‌లకు పరిగెత్తడంతో పాటు మార్నింగ్ వాక్, జాగింగ్, యోగా ఇలా ఎవరికి నచ్చినట్లు వారు ఫాలో అవుతున్నారు. ఇది ఒక రకంగా మంచిదే కానీ.. వ్యాయామం మితిమిరీ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు సంబంధించి టీవీలు, పేపర్లలో వార్తలు చదువుతూనే వున్నాం. తాజాగా ఒక వ్యక్తి ఫిట్‌నెస్ కోసం ఎక్సర్‌సైజ్‌లు చేశాడు ఇందులో విషయం ఏముంది అనుకుంటున్నారా. అతను ఇంట్లో వ్యాయామం చేస్తే ఫర్వాలేదు. ఏకంగా 12వ అంతస్థులో ఓ ఫ్లాట్‌లో బాల్కనీలోకి వచ్చి రెయిలింగ్ పట్టుకుని బయటవైపుకు నించుని సిట్ అప్స్ చేశాడు.
అయితే ఎదురుగా ఉన్న భవనంలో నుంచి ఓ వ్యక్తి ఈ ప్రమాదకరమైన స్టంట్‌ను వీడియో తీశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిని చూసిన వారి వెన్నులో వణుకుపుడుతోంది. అయితే ఇంత డేంజరస్ వర్కవుట్ చేసిన వ్యక్తికి మానసికంగా సమస్య ఉన్నట్టు సమాచారం. ఈ సంఘటన తర్వాత అతనిని ఒంటిరిగా వదలొద్దని, కనిపెట్టుకుని చూసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులు అతని కుటుంబ సభ్యులకు సూచించారు.
కాగా ఇటీవలే ఫరీదాబాద్ హై-రైజ్‌లోని పదో అంతస్థులో పడిపోయిన తన చీరను తీసుకురావడానికి ఒక మహిళ సినిమా స్టైల్‌లో స్టంట్ చేసింది. తన కొడుకును చీర సాయంతో పై నుంచి కిందకు దించింది. ఆ బాలుడు చీరను పట్టుకుని ఎక్కుతుండగా అతని తల్లి, ఇతర కుటుంబ సభ్యులు బాలుడిని పైకి లాగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు.