ఒడిశాలోని బాలాసోర్‌లో మూడు ట్రైన్లు ఢీకొట్టుకున్న ఘటనలో సుమారు 280 మంది ప్రాణాలు కోల్పోయారు. శిథిలాలు తొలగించి ట్రాక్‌ను సెట్ చేసినట్టు అధికారులు చెప్పారు. శిథిలాలు తొలగిస్తుండగా ప్రేమ నింపుకున్న ఓ డైరీ కనిపించింది. పూవులు, ఏనుగు, చేపల బొమ్మలతో ప్రేమ కవితలు ఉన్న ఆ డైరీ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భువనేశ్వర్: ఒడిశా రైలు ప్రమాదం వందల కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కోలుకోలేని దెబ్బేసింది. నుజ్జయిన రైలు బోగీల్లో వదిలిన ఊపిరులెన్నో! రైలు పట్టాలపై బాసిన అసువులు ఇంకెన్నో!! కుటుంబంతో కలిసి ప్రయాణం చేస్తున్నవారు.. జంటగా వెళ్లుతున్నవారు.. ఇష్ట సఖుల కోసం ఒంటరిగా ప్రయాణం చేస్తున్నవారూ ఆ ట్రైన్‌లో ఉండే ఉంటారు. ఇష్టసఖుల కోసం ప్రయాణించారనడానికి ఆధారాలు ప్రేమ కవిత్వాల రూపంలో ట్రైన్ పట్టాలపై దొరికాయి. చిరిగిన డైరీ, అందులోని కమ్మల్లో రాసిన ప్రేమ కవిత్వం ప్రమాదంతో గాయపడ్డ మనసులను ఇప్పుడు మరింత మెలిపెడుతున్నాయి.
ఆ ప్యాసింజర్ తన మనసులోని భావాలను డైరీలో దింపేశారు. తన ఊసులు, ప్రేమైక్య భావాలు, కల్మషం లేని తన మనసును బొమ్మలు, అక్షరాలుగా మార్చారు. డైరీ మొత్తం ప్రేమ గుబాళింపే. కానీ, ఆ ప్రేమను మోసుకెళ్లుతున్న రైలు ముక్కలైంది. గుండెకు దగ్గరగా పెట్టుకుని ఆ డైరీ గాల్లోకి ఎగిరి ఇతర శిథిలాలతో కలిసి రైలు పట్టాలపై పడిపోయింది. చుట్టూ విషాద గీతాలు, ఆర్తనాదాలు. తెగిపడిన కాళ్లు, చేతులు.
బోగీలను తొలగించి పట్టాలు సరి చేస్తున్న వేళ శిథిలాలను పక్కనేస్తుండగా ఆ డైరీ కనపడింది. పూవులు, ఏనుగు, చేప బొమ్మలు, అంతా సహజత్వం పెనవేసుకున్న డైరీ విప్పుకుని కనిపించింది. బెంగాలీ భాషలో రాసిన ప్రేమ కవితలు అందులో నిక్షిప్తమై ఉన్నాయి.
Also Read: అమెరికాలో ఏఐ దెబ్బకు మే నెలలో 4,000 ఉద్యోగాలు హుష్‌కాకి
‘చెదురుమదురుగా కనిపించే మేఘాలు సన్నటి వర్షాన్ని కురిపిస్తాయి. మనం వినే చిట్టి కథలే మనలో ప్రేమను వికసింపజేస్తాయి’ అంటూ స్వదస్తూరితో రాసిన కవిత చదివిన వారి గుండెను పిండేస్తుంది. ‘ప్రేమవై నీవు నాకు ఎల్లప్పుడూ కావాలి, నా మనసులో నీవెప్పుడూ ఉంటావు’ అంటూ మరో కవిత ఉన్నది. ఈ డైరీ ఫొటోలు సోషల్ మీడియాకు ఎక్కాయి. జీవితం ఎంత చంచలమైందో కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Just 2 days back, there was a train accident in Balasore, India.
Too many died and a lot more had serious injuries.
A bundle of love letters and poems were found amongst the debris on the tracks.
A glimpse of a lost romance. A rarity in this age.
Give this post a read. pic.twitter.com/MHUq8LplyD
అయితే, ఈ కవితలు రాసిన వ్యక్తి ఆడ, మగ అనేది తెలియదు. ఇప్పటి వరకు ఈ కవిత తన కోసమే రాశారని ముందుకు వచ్చినవారూ లేరు. అసలు.. ఆ కవిత రాసిన వ్యక్తి పరిస్థితి ఏమిటో? ప్రాణాలతోనైనా ఉన్నారా? అనేది కూడా తెలియదని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
నేటి టెక్ యుగంలో ప్రేమను ఇంత గాఢంగా అదీ డైరీలో రాసుకుని పదిలపరుచుకునే వారు అరుదు. ఇలాంటి అరుదైన వ్యక్తి తాలూకు డైరీ పట్టాలపై గల్లంతై శిథిలంగా కనిపించడం విషాదాన్ని పెంచింది.