సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నారీమన్ పదవీ విరమణ.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ భావోద్వేగం

By Siva KodatiFirst Published Aug 12, 2021, 4:55 PM IST
Highlights

ఎన్నో సంచలన కేసులకు సంబంధించి తీర్పుల్లో భాగస్వామి అయిన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ గురువారం పదవీ విరమణ చేశారు. జస్టిస్ నారీమన్ రిటైర్ కావడంతో న్యాయ వ్యవస్థ ఒక ఉన్నతమైన వ్యక్తిని, ఒక మేథావిని మిస్ అవుతుందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు
 

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ గురువారం పదవీ విరమణ చేశారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ ఆయనే కావడం విశేషం. తన పదవీ కాలంలో జస్టిస్ నారీమన్ ఎన్నో చారిత్రక తీర్పులను వెలువరించడంలో భాగస్వామి అయ్యారు. తన చివరి పనిదినం సందర్భంగా ఈరోజు సీజేఐ ఎన్వీ రమణతో కలిసి కోర్టు హాల్ నంబర్-1లో కూర్చున్నారు. రిటైర్ అవుతున్న జడ్జిలు తమ చివరి రోజున ఈ హాల్లో కూర్చోవడం సంప్రదాయంగా వస్తోంది.

జస్టిస్ నారీమన్ కు వీడ్కోలు పలికే కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. మన బలమైన న్యాయ వ్యవస్థకు ఆయన కూడా ఒక పిల్లర్ అని ప్రశంసించారు. జస్టిస్ నారీమన్ రిటైర్ కావడంతో న్యాయ వ్యవస్థ ఒక ఉన్నతమైన వ్యక్తిని, ఒక మేథావిని మిస్ అవుతుందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. జస్టిస్ నారీమన్ ఎప్పుడూ సత్యం వైపే నిలబడ్డారని..  తన కెరీర్లో మొత్తం 13,565 కేసులను ఆయన డీల్ చేశారని సీజేఐ చెప్పారు.  

కాగా, జస్టిస్ నారీమన్ అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్శిటీలో చదువుకున్నారు. 35 ఏళ్ల పాటు లాయర్ గా ప్రాక్టీస్ చేశారు. ప్రముఖ న్యాయవాది ఫాలీ నారీమన్ కుమారుడే జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్. 37 ఏళ్ల వయసులోనే ఆయనను సీనియర్ న్యాయవాదిగా సుప్రీంకోర్టు గుర్తించింది. 2011లో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఆయన విధులు నిర్వర్తించారు. భారత న్యాయచరిత్రలో నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన ఘనత కేవలం ఆయనకు మాత్రమే దక్కింది

click me!