రాముడు, హనుమంతుడు.. బీజేపీ కాపీరైట్లు కాదు కదా: ఉమా భారతి కామెంట్లు

By Mahesh KFirst Published Dec 30, 2022, 8:04 PM IST
Highlights

బీజేపీ సీనియర్ లీడర్ ఉమా భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాముడు, హనుమాన్‌లు బీజేపీ కాపీ రైట్లు కాదని పేర్కొన్నారు. ఇంతకు ముందు రోజే ఆమె ఓ కార్యక్రమంలో వారికి ఇష్టమున్న పార్టీకి ఓటు వేసుకోవచ్చని అన్నారు.
 

భోపాల్: బీజేపీ సీనియర్ లీడర్ ఉమా భారతి కామెంట్లు సంచలనంగా మారాయి. ఆమె చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీనే గాయపరిచేలా ఉన్నాయి. ఆమె తన కమ్యూనిటీవారు, బీజేపీ మద్దతుదారులతో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, బీజేపీకే ఓటేయాలని తాను చెప్పడం లేదని అన్నారు. మీరు స్వతహాగా ఆలోచించుకుని ఏ పార్టీ సరైనది అనిపిస్తే.. ఆ పార్టీకే ఓటేయండి అని వివరించారు. తాజాగా, ఆమె చేసిన మరో కామెంట్ కూడా పార్టీ వర్గాల్లోనే చర్చనీయాంశమైంది.

మధ్యప్రదేశ్‌లో హనుమంతుడి ఆలయాన్ని మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ నిర్మిస్తున్నారనే ప్రశ్నపై ఆమె స్పందిస్తూ.. రాముడు, హనుమంతుడు.. బీజేపీ కాపీరైట్లు ఏమీ కాదు కదా అని అన్నారు. అంతేకాదు, ఆమె మధ్యప్రదేశ్‌లోని శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్నీ విమర్శించారు.

మధ్యప్రదేశ్‌లో లిక్కర్ పై నిషేధం తేవాలని ఆమె డిమాండ్ చేశారు. ఓ లిక్కర్ స్టోర్ పై ఆమె రాయి విసిరేయడం ఇటీవలే సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మాజీ సీఎం, రాష్ట్రంలోని బీజేపీలో కీలకమైన నేత ఉమా భారతి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. పార్టీ నాయకత్వం ఆమెను పట్టించుకోవడం లేదని, పక్కనపెట్టిందని ఆమె అప్‌సెట్ అయినట్టు కొన్ని కథనాలు వచ్చాయి. 

కాగా, ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. హిందువులు ఆయుధాలను ఇంటిలో ఉంచుకోవడం మంచిదే అని అన్నారు. వనవాసానికి వెళ్లినప్పుడు కూడా రాముడు ఆయుధాలను విడిచిపెట్టలేదని అన్నారు. ఆయుధాలను ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదని, కానీ, హింసాత్మక ఆలోచనలు కలిగి ఉండటం తప్పు అని తెలిపారు.

click me!