లోక్‌సభ సీటుకు రూ. 5 కోట్లా? ఆ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: కోర్టు ఆదేశం

By telugu teamFirst Published Sep 19, 2021, 8:14 PM IST
Highlights

బిహార్‌లో లోక్ సభ టికెట్ కోసం రూ. ఐదు కోట్ల డిమాండ్ చేశారని, ఆ మొత్తాలను ఇచ్చినా తనకు టికెట్ ఇవ్వలేదని ఓ కాంగ్రెస్ నేత కోర్టుకెక్కారు. ఈ ఫిర్యాదును విచారించిన కోర్టు విస్మయం వ్యక్తం చేస్తూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఇతర కాంగ్రెస్ నేతలపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశించింది.

పాట్నా: బిహార్‌లో ఓ చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పు సంచలనాన్ని రేపింది. లోక్‌సభలో పోటీ చేయడానికి టికెట్ కోసం రూ. 5 కోట్లు చెల్లించాలా? అంటూ విస్మయాన్ని ప్రకటిస్తూ ఆరుగురు మహాగట్‌బంధన్ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కాంగ్రెస్ లీడర్ సంజీవ్ కుమార్ సింగ్ చేసిన ఫిర్యాదుపై చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్(సీజేఎం) విజయ్ కిశోర్ సింగ్ విచారించి ఈ ఆదేశాలను వెలువరించారు.

2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తనకు టికెట్ కావాలని అడిగారని సంజీవ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. దీనికి తేజస్వీ యాదవ్, మిశా భారతి, మదన్ మోహన్ ఝా, సదానంద్ సింగ్, రాజేశ్ రాథోర్‌లు రూ. 5 కోట్లు అడిగారని, అవి చెల్లిస్తే బగల్‌పూర్ నుంచి లోక్‌సభ టికెట్ ఇస్తామని హామీనిచ్చారని ఆరోపిస్తూ గతనెల 18న పాట్నా సీజేఎంలో ఫిర్యాదు చేశారు. కానీ, తనకు టికెట్ ఇవ్వకపోవడాన్ని తర్వాత ప్రశ్నిస్తే బిహార్ అసెంబ్లీ ఎన్నికల(2020)లో టికెట్ ఇస్తామని చెప్పారని, అప్పుడూ తనకు హ్యాండ్ ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ వాదనలు విన్న తర్వాత ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, మిశా భారతి సహా మరో నలుగురిపై కొత్వాలి స్టేషన్‌లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఎస్ఎస్‌పీ ఉపేంద్ర శర్మను సీజేఎం ఆదేశించింది.

ఈ ఆదేశాలపై అధికార జేడీయూ స్పందిస్తూ ఆర్జేడీపై విమర్శలు చేసింది. టికెట్లు అమ్ముకుంటూ ఆర్జేడీ వ్యాపారం చేస్తుండటం బాధాకరమని, ఆ పార్టీ ఇంకెంతగా దిగజారుతుందో తెలియడం లేదని విమర్శించారు. కాగా, ఆర్జేడీ ఈ తీర్పుపై స్పందిస్తూ ఫిర్యాదులోని వివరాలను తోసిపుచ్చింది. ఆ ఆరోపణ చేస్తున్నవ్యక్తికి మానసిక స్థిమితం లేదని, అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారని ఆర్జేడీ ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ అన్నారు.

click me!