పార్లమెంట్ సమావేశాలపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు: వీళ్లకు మాత్రం నో ఎంట్రీ

By Siva KodatiFirst Published Jun 5, 2020, 5:12 PM IST
Highlights

కరోనా దృష్ట్యా పార్లమెంట్ సభ్యులు అనుసరించాల్సిన విధివిధానాలపై శుక్రవారం లోక్‌సభ సచివాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్‌లోకి ఎంపీల వ్యక్తిగత సిబ్బంది ప్రవేశానికీ పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది

భారతదేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇస్తున్నాయి. ఈ నేపధ్యంలో దేశ రాజకీయ, పరిపాలనలో కీలకపాత్ర పోషించే పార్లమెంట్‌ సమావేశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

అయితే కరోనా దృష్ట్యా పార్లమెంట్ సభ్యులు అనుసరించాల్సిన విధివిధానాలపై శుక్రవారం లోక్‌సభ సచివాలయం కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంట్‌లోకి ఎంపీల వ్యక్తిగత సిబ్బంది ప్రవేశానికీ పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్నేహలత శ్రీవాస్తవ తెలిపారు. సభ్యులతో పాటు వ్యక్తిగత సిబ్బంది పార్లమెంట్ పరిసరాల్లోకి రావడం వల్ల సమావేశాలు జరుగుతున్న సమయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం వుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read:వర్చువల్ పార్లమెంట్ దిశగా కేంద్రం అడుగులు: త్వరలో తేదీలు

దేశంలో కోవిడ్ 19 కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దీనిని కట్టడి చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు. భౌతిక దూరం నిబంధనలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్నేహలత వెల్లడించారు.

అంతేకాకుండా వివిధ పనుల మీద పార్లమెంట్‌కు వచ్చే కింది స్థాయి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, సందర్శకకుల ప్రవేశంపైనా ఆంక్షలు విధించారు. కాగా లాక్‌డౌన్ అనంతరం మే 3న పార్లమెంట్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నలుగురు సిబ్బందికి పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పార్లమెంట్ భవనం రెండు అంతస్తులను సీజ్ చేసి శానిటైజేషన్ చేశారు. 

click me!