సామాన్యూల ఓటు గల్లంతవడం సాదారణంగా జరుగుతుంటుంది. కానీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల ఓట్లు గల్లంతయితే. ఇలాంటి ఘటనే పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసింది.
ఓటు వేయడం ప్రతి ఒక్కరి హక్కు. మనల్ని పాలించే నాయకులను మనమే ఎన్నుకునేందుకు ఉపయోగించే బ్రహ్మాస్త్రమే ఈ ఓటు. అయితే కొందరు విలువైన ఓటుహక్కును వినియోగించుకునేందుకు బద్దకిస్తుంటే మరికొందరు అధికారుల తప్పిదాలవల్ల ఓటు వేయలేకపోతున్నారు. ఇలా సామాన్యులు, అరుదుగా ప్రముఖులు ఓట్లు గల్లంతవడం చూస్తుంటాం... కానీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడి ఓటు గల్లంతయితే. తన సోదరి పాలిస్తున్న రాష్ట్రంలోనే అతడు ఓటు వేయలేకపోతే..! ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసింది.
అసలేం జరిగింది...:
undefined
దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఐదు దశల్లో పోలింగ్ ముగిసింది. నిన్న(సోమవారం) పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఐదో దశ పోలింగ్ ముగిసింది. ఇలా పశ్చిమ బెంగాల్ లోని పలు లోక్ సభ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ జరిగింది... ఇందులో హౌరా లోక్ సభ కూడా ఒకటి.
అయితే ఈ లోక్ సభ పరిధిలోనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీ నివాసం వుంటున్నాడు. పోలింగ్ రోజు ఉదయమే బబున్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓ పోలింగ్ బూత్ కు వెళ్లాడు... కానీ ఓటు వేయకుండానే తిరిగి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అతడి పేరు ఓటర్ లిస్ట్ నుండి గల్లంతయ్యింది... దీంతో పోలింగ్ సిబ్బంది అతడిని ఓటు వేయనివ్వలేదు. ఇలా ఏకంగా సీఎం సోదరుడి ఓటు గల్లంతు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.
టీఎంసి, ఈసీ ఏమంటున్నాయి..:
మమతా బెనర్జీ సోదరుడు బబున్ బెనర్జీ ఓటు గల్లంతవడంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఎన్నికల సంఘమే దీనిపై వివరణ ఇవ్వాలని టీఎంసి పార్టీ అధికార ప్రతినిధి శంతను సేన్ కోరారు. ఈ వ్యవహారం గురించి టిఎంసి ఎలాంటి కామెంట్స్ చేయబోదని అన్నారు. ఎన్నికల సంఘం బబున్ బెనర్జీ ఓటు గల్లంతుకు గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో వున్నామని అంటోంది.
మమతతో సోదరుడి విబేధాలు :
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పక్కా రాజకీయ నాయకురాలు. కుటుంబం కోసమో, స్నేహితుల కోసమో, ఇంకెవరి కోసమే తన రాజకీయ నిర్ణయాలను మార్చుకునే రకం కాదు. హౌరా లోక్ సభ సీటు వ్యవహారమే ఇందుకు ఉదాహరణ. ఈ సీటును మమత సోదరుడు బబున్ ఆశించాడు... కానీ అతడికి సీటు దక్కలేదు. సోదరుడికి కాదని హౌరా సిట్టింగ్ ఎంపీ ప్రసూన్ బెనర్జీకే మళ్లీ అవకాశం ఇచ్చారు మమత. దీంతో సోదరి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టిఎంసీ వ్యవహారాలకు దూరంగా వున్నారు బబున్ బెనర్జీ.
ఇలా హౌరా టికెట్ విషయంలో సోదరితో విబేధించిన బబున్ బిజెపిలో చేరతారని కూడా ప్రచారం జరిగింది. హౌరా టికెట్ బబున్ కు కేటాయించేందుకు బిజెపి సిద్దమయ్యిందంటూ... అతడు చేరిక ఖాయమని రాజకీయ చర్చ జరిగింది. కానీ ఏమయ్యిందో గానీ బబున్ బిజెపిలో చేరలేదు.
ప్రస్తుతం బబున్ బెనర్జీ బెంగాల్ ఒలింపిక్ అసోసియేషన్, హాకీ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంతేకాదు బెంగాల్ బాక్సింగ్ అసోసియేషన్ సెక్రటరీగా వున్నారు. తృణమూల్ కాంగ్రెస్ స్పోర్ట్స్ వింగ్ ఇంచార్జీగా కూడా బబున్ బెనర్జీ కొనసాగుతున్నారు.