2014 లోక్ సభ ఎన్నికలు క్లైమాక్ప్ కు చేరుకున్నాయి. ఇవాళ చివరి దశ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగుతోంది. ప్రధాని మోదీతో సహా పలువురు ప్రముఖులు ఈ దశలోని బరిలో నిలిచారు.
దేశవ్యాప్తంగా గత రెండు నెలలుగా లోక్ సభ ఎన్నికల సందడి నెలకొంది... రాజకీయాలు వాడివేడిగా సాగాయి. ఈ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి... నేటితో (శనివారం) పోలింగ్ కు తెరపడనుంది. ఇవాళ ఉదయం ఏడో దశ ఎన్నికల్లో భాగంగా కీలకమైన పోలింగ్ ప్రారంభమయ్యింది... సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకునే అవకాశం వుంటుంది.
ఎండల తీవ్రత అధికంగా వుండటంతో ఉదయమే ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పోలింగ్ ప్రారంభంకాంగానే పలు బూత్ ల వద్ద ఓటర్లు బారులుతీరారు. కొత్తగా ఓటుహక్కును పొందిన యువ ఓటర్ల నుండి వృద్దుల వరకు అందరూ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రతిఒక్కరు ఓటుహక్కును వినియోగించుకుని భారీగా పోలింగ్ శాతం నమోదయ్యేలా చూడాలని కోరారు.
చివరిదశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో 13, పంజాబ్ 13, బిహార్ 8, పశ్చిమ బెంగాల్ 9, ఒడిశా 6, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3 స్ధానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తంగా ఇవాళ 10 కోట్లమంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 904 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు... వీరి భవితవ్యం నేడు ఈవిఎంలలో నిక్షిప్తం కానుంది.
పోటీలో వున్న ప్రముఖులు వీరే :
ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోక్ సభ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్నారు. గత రెండుసార్లు ఇక్కడినుండే పోటీచేసిన మోదీ ఈసారి హ్యాట్రిక్ విజయంపై కన్నేసారు. మోదీపై అజయ్ రాయ్ ని పోటీలో నిలిపింది కాంగ్రెస్ పార్టీ.
ఇక హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుండి బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ బిజెపి నుండి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుండి విక్రమాదిత్య సింగ్ పోటీ చేస్తున్నారు.
ఇదే హిమాచల్ ప్రదేశ్ లో మరో లోక్ సభ హమీర్ పూర్ నుండి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బిజెపి తరపున బరిలో నిలిచారు. ఈయనపై కాంగ్రెస్ సత్యపాల్ సింగ్ ను బరిలోో నిలిపింది.మీర్జా
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వస్థలం గోరఖ్ పూర్. ఇక్కడి నుండి గతంలో యోగి ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు ఈ లోక్ సభలో బిజెపి అభ్యర్థిగా సినీ నటుడు రవికిషన్ పోటీ చేస్తున్నారు.
మీర్జాపూర్ లోక్ సభ స్థానంలో అప్నాదళ్ అధినేత్రి అనుప్రియ పటేల్ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో వున్నారు.
బలియా లోక్ సభ నుండి మాజీ ప్రధాని చంద్రశేఖర్ తనయుడు నీరజ్ శేఖర్ బిజెపి అభ్యర్థిగా బరిలోకి దిగారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ లోక్ సభ నుండి పోటీ చేస్తున్నారు.
బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీ దంపతులు కుమార్తే మీసా భారతి పాటలీపుత్రం లోక్ సభ నుండి పోటీ చేస్తున్నారు.