
న్యూఢిల్లీ: మణిపూర్ అంశంపై విపక్ష సభ్యుల నిరసనలతో లోక్ సభలో బుధవారంనాడు గందరగోళం నెలకొంది. దీంతో లోక్ సభను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలవరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు.
లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నినాదాలు చేశారు. ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లోక్ సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమయ్యాయి. ప్రతి రోజూ పార్లమెంట్ ఉభయ సభల్లో మణిపూర్ అంశంపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మణిపూర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి విపక్ష పార్టీలు.
విపక్ష పార్టీల ఎంపీల ఆందోళనల మధ్యే ప్రశ్నోత్తరాలను స్పీకర్ ఓం బిర్లా కొనసాగించారు. అయితే విపక్ష సభ్యులు ప్ల కార్డులతో పోడియం వద్దకు వచ్చారు. నినాదాలు చేశారు. ఈ పరిస్థితులతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.