
దేశంలో రోజు రోజుకీ అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పెరిగిన ధరలతో సామాన్యులు చాలా తిప్పలు పడుతున్నారు. కాగా.. ఈ పెరిగిన ధరల వల్ల ఒకటో తరగతి చదువుతున్న ఓ చిన్నారి కూడా చాలా ఇబ్బంది పడిపోయింది. ఇదే విషయాన్ని ఆమె ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి కూడా చెప్పడం గమనార్హం.
ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా చిబ్రమౌ కి చెందిన కృతి దూబే అనే ఆరేళ్ల చిన్నారి ఒకటో తరగతి చదువుతోంది. అయితే... ఆ చిన్నారి ఇటీవల రెండు, మూడు సార్లు స్కూల్లో పెన్సిల్ పొగొట్టుకుంది. అయితే.. పెన్సిల్...పోగొట్టుకుందని వాళ్ల అమ్మ తిట్టిందట. దీంతో... పేపర్, పెన్సిల్ తీసుకొని నేరుగా ప్రధాని మోదీని ఉద్దేశించి.. ‘మీరు ఇంతలా ధరలు పెంచేస్తే ఎలా?’ అని ప్రశ్నిస్తూ హిందీలో ఓ లేఖ రాసేసింది.
‘నమస్తే సర్ .. నా పేరు కృతీ దూబే. ఒకటో తరగతి చదువుతున్నాను. మీరు ధరలు బాగా పెంచుతున్నారు. పెన్సిల్, ఎరేజర్ కాస్ట్‌లీ అయ్యాయి. స్కూల్లో వాటిని పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటి..?’ అంటూ చిన్నారి లేఖ రాయడం గమనార్హం. అంతేకాకుండా.. పిల్లలు ఎంతగానో ఇష్టంగా తినే మ్యాగీ ధర కూడా పెరిగిపోయిందని ఆ చిన్నారి లేఖలో పేర్కనడం విశేషం. అయితే.. ఆ చిన్నారి లేఖ మోదీని చేరిందో లేదో తెలీదు కానీ... నెట్టింట మాత్రం వైరల్ గా మారింది.
ఆ చిన్నారి తండ్రి విశాల్ దూబే.. చిన్నారి లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అతను ఓ న్యాయవాది కావడం గమనార్హం. ఆ లేఖను పోస్టు చేసి.. ఇది తమ చిన్నారి మన్ కీ బాత్ అంటూ ఆయన క్యాప్షన్ జత చేయడం గమనార్హం.