
Wrongly Parked Vehicle: ప్రస్తుతం పెరుగుతున్న వాహనాలతో పార్కింగ్ పెద్ద సమస్యగా మారింది. ప్రధానంగా నగరాల్లో పలువురు వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా నో పార్కింగ్ ఏరియాలో వాహనాలను పార్క్ చేస్తున్నారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వినూత్న ఆలోచనతో కేంద్రం ముందుకొస్తోంది. చేయకూడని చోట వాహనాన్ని పార్కింగ్ చేసి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించే వారికి ఇక నుంచి షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఈ క్రమంలో రాంగ్ పార్కింగ్‌కు సంబంధించి చట్టాన్ని త్వరలో తేనున్నది.
ఇకపై రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫొటోను తీసి.. ట్రాఫిక్ అధికారులకు పంపితే.. పంపిన వ్యక్తికి రివార్డ్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం ప్రకటించారు. రాంగ్ పార్కింగ్‌కు రూ.1000 జరిమానా విధిస్తే.. ఫొటో పంపిన వ్యక్తికి రూ.500 రివార్డగా ఇవ్వనున్నట్లు తెలిపారు. దీని కోసం ఓ చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు.
గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రోడ్డుపై తప్పుగా పార్కింగ్ చేసే వాహనాలను అడ్డుకునేందుకు చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్లు చెప్పారు. రోడ్డుపై వాహనాన్ని నిలిపితే రూ.1000 జరిమానా విధించేలా చట్టం తీసుకురాబోతున్నామని తెలిపారు. రాంగ్ పార్కింగ్ చేసిన వాహనం ఫొటోను తీసి.. ట్రాఫిక్ అధికారులకు పంపితే.. పంపిన వ్యక్తికి రూ. 500 ల రివార్డ్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.
ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ స్థలాల్లో కాకుండా.. ఇష్టానుసారంగా రోడ్లపై పార్కింగ్ చేయడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. నాగ్‌పుర్‌లోని తన వంటవాడికి రెండు వాహనాలు ఉన్నాయని, ఒక్కో కుటుంబానికి ఆరు కార్లు ఉంటున్నాయని చెప్పారు. ఈ విషయంలో దిల్లీ వాసులు అదృష్ట వంతులని.. పార్కింగ్ కోసం అక్కడ ప్రత్యేకంగా రహదారులు ఉన్నాయని పేర్కొన్నారు.