చిక్కుల్లో చందాకొచ్చర్: క్లీన్ చిట్‌కు ఐసీఐసీఐ "నో"

By sivanagaprasad kodatiFirst Published Oct 24, 2018, 9:05 AM IST
Highlights

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్ చిక్కుల్లో పడుతున్నారు. గతంలో ఆమెకు క్లిన్ చిట్ ఇచ్చిన సిరిల్ అమర్ చంద్ మంగళ్ దాస్ సంస్థ తన నివేదికను ఉపసంహరించుకున్నది. ఈ నేపథ్యంలో చందాకొచ్చర్ కు క్లీన్ చిట్ ఇవ్వలేమని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. 

దాదాపు దశాబ్ధ కాలం పాటు దేశీయ అగ్రశ్రేణి ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా పని చేసి, ఇటీవలే రాజీనామా చేసిన చందాకొచ్చర్ క్రమంగా చిక్కుల్లో పడుతున్నారు. తమ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ చందా కొచ్చర్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేమని ఐసీఐసీఐ బ్యాంక్ తేల్చేసింది.

వీడియోకాన్‌ గ్రూపునకు రుణం జారీ వెనుక ప్రయోజనం పొందారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటూ, ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో పదవుల నుంచి క్విడ్‌ ప్రోకో ఆరోపణలపై దర్యాప్తు చేసి క్లీన్‌ చిట్‌ ఇచ్చిన సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ సంస్థ తాజాగా తన నివేదికను ఉపసంహరించుకున్నది. 

సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ దర్యాప్తు నివేదిక ఆధారంగా కొచర్‌కు ఈ ఏడాది మార్చిలో తామూ క్లీన్‌ చిట్‌ ఇవ్వడం జరిగిందని, కానీ ఆ నివేదికను ప్రామాణికంగా తీసుకోవద్దని ఇప్పుడు ఆ న్యాయ సేవల సంస్థే అంటోందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది.

కానీ ఆమెపై వచ్చిన ఆరోపణలను నాటి బ్యాంక్ చైర్మన్ ఎంకే శర్మ తోసిపుచ్చారు. చందాకొచ్ఛర్ ఎటువంటి అశ్రితపక్షపాతానికి పాల్పడలేదని ఆమెపై పూర్తి విశ్వాసం ఉన్నదని ప్రకటించారు. 

వీడియోకాన్‌ గ్రూపునకు 2012లో రూ.3,250 కోట్ల రుణ మంజూరు వ్యవహారంలో చందా కొచ్చర్‌ కుటుంబం అయాచిత లబ్ధి పొందిందని, వీడియోకాన్‌ గ్రూపు అధినేత వేణుగోపాల్‌ ధూత్‌, చందా కొచ్చర్‌కు మధ్య క్విడ్‌ ప్రో కో జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఐసీఐసీఐ బ్యాంక్‌.. సిరిల్‌ అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌తో దర్యాప్తు జరిపించింది.
 
కానీ ఆ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేదంటూ 2016 డిసెంబర్‌లో సంస్థ నివేదిక సమర్పించింది. ఈ విచారణ నివేదికను ఆధారంగా చేసుకునే ఈ ఏడాది మార్చిలో చందాకొచ్చర్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తాము క్లీన్‌చిట్‌ ఇచ్చామని అమర్‌చంద్‌ మంగళ్‌దాస్‌ తన నివేదికను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో అదిక చెల్లుబాటు కాదని బ్యాంకు స్పష్టం చేసింది.

ప్రజావేగుల నుంచి వచ్చిన తాజా ఆరోపణలు, బ్యాంకుకు లభించిన అదనపు సమాచారం ఆధారంగా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి బీఎన్‌ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో విచారణ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ మార్చిలో కొచర్‌పై అదే ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చినా కొచర్‌కు బ్యాంక్‌ బోర్డు బాసటగా నిలిచింది. ఆమెపై పూర్తి విశ్వాసం ఉందని పేర్కొంది. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. 

చందాకొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలపై సెబీ, ఎస్‌ఎఫ్ఐఓతో పాటు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ కూడా దర్యాప్తు ప్రారంభించాయి. ఈ నెల నాలుగో తేదీన ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ కం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవులకు ఆమె రాజీనామా చేశారు. ఆమె తర్వాత బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా సందీప్ బక్షిని 2023 అక్టోబర్ మూడో తేదీ వరకు ఐదేళ్ల పాటు నియమిస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. 

click me!