
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లో పోలీసు రిక్రూట్‌మెంట్‌లో భారీ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. పెద్ద స్థాయిలో అవినీతి చోటుచేసుకున్నట్టు తెలుస్తున్నది. దీంతో 1,200 పోలీసు అధికారుల మెరిట్ లిస్టును రద్దు చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీబీఐతో దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేరశారు.
జేకేఎస్ఎస్‌బీ పోలీసు రిక్రూట్‌మెంట్ కోసం పరీక్ష నిర్వహించింది. ఇందులో సుమారు 97 వేల మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ ఎగ్జామ్‌కు సంబంధించిన మెరిట్ లిస్టును విడుదల చేశారు. గత నెలలోనే సబ్ ఇన్‌స్పెక్టర్‌ల మెరిట్ లిస్టును విడుదల చేశారు. ఇందులో అనేక లోపాలు కనిపించాయి. ఈ లిస్టులో టాపర్లుగా ఉన్నవారు 20 కుటుంబాలకు చెందినవారే కావడం పోలీసు ఎంపిక ప్రక్రియపైనే అనుమానాలు తెప్పించాయి. అంతేకాదు, ఒకే ఏరియా నుంచి ఒకే సెంటర్ నుంచి డజన్ల కొద్ది అభ్యర్థులు సెలెక్ట్ కావడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చింది.
దీంతో అభ్యర్థులు వీధుల్లోకి వచ్చారు. ఆందోళనలు చేశారు. పెద్ద మొత్తంలో అవినీతి చోటుచేసుకుందని, మెరిట్ లిస్ట్ తయారీలో అవకతవకలు జరిగాయని వారు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే జమ్ము కశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.
జమ్ము కశ్మీర్ హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఆర్‌కే గోయల్ సారథ్యంలో ఓ కమిటీ వేసి దర్యాప్తునకు ఆదేశించింది. ఈ దర్యాప్తు నివేదికను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు సమర్పించింది. జమ్ము కశ్మీర్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు గత నెల నిర్వహించిన పోలీసు సబ్ ఇన్‌స్పెక్టర్‌ల పరీక్షకు సంబంధించిన మెరిట్ లిస్టు తయారీలో పెద్ద స్థాయిలో అవినీతి, మ్యానిపులేషన్ చోటుచేసుకున్నట్టు ఆ నివేదిక తెలిపింది. దీంతో సీబీఐతో దర్యాప్తునకు ఆయన ఆదేశించారు.
2019లో జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత అక్కడ నిర్వహించిన కీలకమైన రిక్రూట్‌మెంట్ డ్రైవ్. కానీ, అందులో భారీగా ఫ్రాడ్ చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
జమ్ము కశ్మీర్‌లో ఎన్నిక ప్రభుత్వాన్ని కూల్చేసి అవినీతిని అంతం చేశామని ప్రభుత్వం వాదించిందని స్థానిక రాజకీయ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్‌లోనే అవినీతి జరుగుతున్నదని, ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశాయి.