
Jharkhand 12-Year-Old Girl Kidnapped: దేశంలో మహిళల రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా వాటి అమలు తీరులో నిర్లక్ష్యమో ఎమో కానీ వారిపై హింస, అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో ఒకచోట సంబంధిత ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఓ 12 ఏండ్ల బాలిక కిడ్నాప్ గురైంది. అనంతరం నిందితులు బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి.. జార్ఖండ్‌లోని దుమ్కా జిల్లాలో 12 ఏళ్ల బాలికను ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి, అత్యాచారం చేసి పొరుగున ఉన్న గొడ్డాలో పడేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. 6వ తరగతి చదువుతున్న బాలిక తన పాఠశాల తరగతులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా నిందితులు బాలికను కిడ్నాప్ చేశారు. బుధవారం గోపికందర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గొడ్డాలో స్థానికులు ఆమెను గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో బాలిక కుటుంబ సభ్యులు గురువారం ఫిర్యాదు చేశారని దుమ్కా సబ్ డివిజనల్ పోలీసు అధికారి (ఎస్‌డీపీవో) నూర్ ముస్తఫా అన్సారీ వెల్లడించినట్టు పీటీఐ నివేదించింది.
దుమ్కాలోని ఫూలో ఝానో ముర్ము మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (పీజేఎంఎంసీహెచ్) లో బాలిక చికిత్స పొందుతోంది. బాధితురాలు మైనర్ బాలికకు గురువారం వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్నామనీ, దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. తాము నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని SDPO తెలిపారు. తాను బుధవారం పాఠశాలకు వెళ్లానని, అయితే నోట్‌బుక్ తీసుకెళ్లడం మర్చిపోయానని, దానిని తీసుకురావడానికి ఇంటికి తిరిగి వచ్చానని బాలిక తన వాంగ్మూలంలో పోలీసులకు తెలిపింది. బాలిక ఇంటికి వెళుతుండగా, కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు బాలికను ఆమె గ్రామంలోని నది గురించి అడిగారు.. ఈ క్రమంలోనే బాలిక వారికి సమాధానం చెప్పడానికి ఆగినప్పుడు, నిందితులు ఆమెను కిడ్నాప్ చేశారని మరో పోలీసు అధికారి తెలిపారు. మరుసటి రోజు గొడ్డా జిల్లాలోని చాందినీ చౌక్ సమీపంలో పడేశారని బాధితురాలు చెప్పిందని దుమ్కా పోలీసులకు వెల్లడించారు.
జంషెడ్‌పూర్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం..
అలాగే, జంషెడ్‌పూర్ (Jamshedpur) లో మైనర్ బాలిక (Minor Girl) పై సామూహిక అత్యాచారం ఘనట ఈ నెల 3న చోటుచేసుకుంది. జంషెడ్‌పూర్‌లోని పర్సుదిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 13 ఏళ్ల మైనర్‌పై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మైనర్ ఫిర్యాదు మేరకు ఐదుగురు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నేరం చేసినప్పటి నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. ఈ సంఘటన జూలై 3 అర్థరాత్రి జరిగింది. మైనర్ కుటుంబం జూలై 4 న పోలీసులకు ఫిర్యాదు చేసింది.