మోడీ తరుచూ కుటుంబ పాలన అంటూ మాట్లాడతారని, ఆయనకు కుటుంబం ఎందుకు లేదు? పిల్లలు ఎందుకు లేరు? చెప్పగలరా? అంటూ బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ ప్రధాని మోడీపై వ్యక్తిగత దాడికి దిగారు. ఇందుకు సమాధానంగా దేశ ప్రజలంతా తన కుటుంబమేనని మోడీ పేర్కొన్నారు. బీజేపీ నాయకులు మోడీ కా పరివార్ అంటూ సోషల్ మీడియాలో బయోలు మార్చుకుంటున్నారు.
Modi Ka Parivar: ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వ్యక్తిగత దాడికి దిగితే.. అది వారికే సెల్ఫ్ గోల్‌గా మారుతుందనే వాదన మరోసారి నిజం అవుతున్నది. బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్.. నరేంద్ర మోడీపై చేసిన వ్యాఖ్యలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కుటుంబం, పిల్లలు లేరని విమర్శించారు. ఎప్పుడూ కుటుంబ పాలన అంటూ మాట్లాడే మోడీకి.. పిల్లలు ఎందుకు లేరో చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఈ విమర్శలకు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో సమాధానం చెప్పారు. ఈ దేశ ప్రజలందరూ తన కుటుంబమేనని పేర్కొన్నారు. అసలు ఏ కుటుంబం లేని వారికి కూడా తాను అండగా ఉంటానని, తాను ప్రజల మనిషి అని కామెంట్ చేశారు. అంతే వేగంగా.. బీజేపీ నాయకులు కూడా తమది మోడీ కుటుంబం అని ఎక్స్ బయోలు అప్‌డేట్ చేయడం మొదలు పెట్టారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జి కిషన్ రెడ్డి, స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావడేకర్, ప్రహ్లాద్ జోషి, నితిన్ గడ్కరీ, అనురాగ్ ఠాకూర్, పియుశ్ గోయల్ సహా చాలా మంది బీజేపీ అగ్రనాయకులు మొదలు కార్యకర్తల వరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికపై తమ బయో మార్చేశారు. అందులో కొత్తగా మోడీ కా పరివార్ అనే వాక్యాన్ని చేర్చారు. తద్వారా మోడీకి కుటుంబం లేదని తప్పని, తామంతా మోడీ కుటుంబమేనని వారు చెప్పకనే చెబుతున్నారు.
ఇదొక నెరేటివ్‌గా మారుతున్నది. 2019లో చౌకీదార్ మోడీ అనే కామెంట్ తరహాలోనే.. ఈ సారి 2024 లోక్ సభ ఎన్నికల్లో మోడీ కా పరివార్ అనే కామెంట్ వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చిస్తున్నారు. ఈ నెరేటివ్‌ను ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు వేగంగా అడాప్ట్ చేసుకుంటున్నారు.