జులై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలు.. వారంలో నాలుగు రోజుల పని దినాలు, వేతనం, పీఎఫ్‌ జమ వివరాలివే

By Mahesh KFirst Published Jun 30, 2022, 7:28 PM IST
Highlights

జులై 1వ తేదీ నుంచి కొత్త లేబర్ కోడ్‌లు అమల్లోకి వస్తున్నాయి. ఈ కోడ్‌లతో పని దినాలు, వేతనాలు, పీఎఫ్ ఖాతాలో జమ, సెలవులకు సంబంధించి కీలక మార్పులు అమల్లోకి వస్తాయి. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
 

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలన్నింటినీ నాలుగు కోడ్‌లుగా రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే, కార్మిక చట్టాలు ఉమ్మడి జాబితాలో ఉంటాయి. కాబట్టి, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఈ నాలుగు కోడ్‌లకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలూ నిబంధనలు రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పటికే దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ నిబంధనలు రూపొందించాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఏకకాలంలో ఈ నిబంధనలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నది. 

కేంద్ర ప్రభుత్వం వేతనాలు, సామాజిక భద్రత, పారిశ్రామిక సంబంధాలు, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణలుగా ఈ కోడ్‌లను రూపొందించింది. ఈ నిబంధనలు జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. 

ఈ నాలుగు లేబర్ కోడ్‌లు ఆర్థిక సంవత్సరం 2022-23 నుంచి అమలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, ఇప్పటికే పెద్ద సంఖ్యలో రాష్ట్రాలు వాటి డ్రాఫ్ట్ రూల్స్‌ను ఖరారు చేశాయని అధికారులు వెల్లడించారు. ఫిబ్రవరి 2021 నాటికి ఈ కోడ్స్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్‌ను ఖరారు చేసే ప్రక్రియను కేంద్రం పూర్తి చేసిందని గతేడాది డిసెంబర్‌లో చెప్పారు.

కొత్త కోడ్‌లు అమల్లోకి వస్తే టేక్ హోం శాలరీ తగ్గనుంది. కాగా, పీఎఫ్ జమ పెరగనుంది. అంతేకాదు, పని గంటల్లోను మార్పులు ఉండనున్నాయి. అంటే ఒక వారంలో నాలుగు రోజులు మాత్రమే పని చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, అలాగైతే.. ఒక రోజు 12 గంటల డ్యూటీ చేయాల్సి ఉంటుందని కేంద్ర లేబర్ మినిస్ట్రీ తెలిపింది. ఎందుకంటే.. వారంలో పని గంటలు 48 గంటలు ఉండాలని తెలిపింది. కాబట్టి, ఆరు రోజులు ఎనిమిది గంటల చొప్పున చేస్తే 48 పని గంటలు అవుతాయి. అవే పని గంటలను మెయింటెయిన్ చేస్తూ రోజుకు 12 గంటలకు పెంచి.. రోజులను ఆరు నుంచి నాలుగుకు తగ్గించే అవకాశాలు ఈ కొత్త కోడ్‌ల కింద ఉన్నాయి. కాబట్టి, ఈ కొత్త కార్మిక కోడ్‌ల గురించి పరిశీలిద్దాం.

కొత్త రూల్స్ ప్రకారం, వారంలో నాలుగు రోజులే పని చేస్తారు. ప్రస్తుతం ఐదు రోజుల పని దినాలు ఉన్నాయి. అంటే.. కొత్త చట్టాల ప్రకారం వారంలో మూడు రోజులు సెలవులే ఉంటాయి. ఈ 4 రోజులు.. 12 గంటల చొప్పున డ్యూటీ చేయాల్సి ఉంటుంది. అలాగే, ఓవర్ టైమ్ గంటలనూ పెంచనుంది. ఓవర్ టైమ్ గంటలను 50 గంటల నుంచి 125 గంటలకు పెంచే అవకాశం ఉన్నది.

అలాగే, వేతనం, పీఎఫ్ కాంట్రిబ్యూషన్ విషయంలోనూ మార్పులు రాబోతున్నాయి. అంటే.. ఒక ఉద్యోగి జీతంలో అలవెన్సులను 50 శాతానికే కుదించనున్నారు. అంటే.. మిగతా సగం బేసిక్ సాలరీ అన్నట్టే. దీని ద్వారా పీఎఫ్‌ ఖాతాలో ఉద్యోగి, యజమాని కట్టే మొత్తాలు పెరగనున్నాయి. ప్రస్తుతం పీఎఫ్‌ను బేసిక్ సాలరీ, డియర్‌నెస్ అలవెన్స్‌లను పరిగణనలోకి తీసుకుని లెక్కిస్తారు. కనీస వేతనాన్ని మొత్తం జీతంలో 50 శాతానికి పెంచడంతో పీఎఫ్ కట్టే మొత్తాలు పెరగనున్నాయి. దీంతో నెలవారీగా చేతిలోకి వచ్చే జీతం తగ్గి.. పీఎఫ్‌ ఖాతాలో జమ పెరగనుంది. 

పీఎఫ్ ఖాతాలో నెలవారీగా కట్టే మొత్తాలు పెరగడంతో ఉద్యోగులు పదవీ విరమణ పొందిన తర్వాత ఎక్కువ మొత్తాన్ని పొందనున్నారు. రిటైర్‌మెంట్ ఫండ్ పెరుగుతుంది. కాగా, సెలవుల నిబంధనల్లోనూ మార్పులు రాబోతున్నాయి. లీవులను వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేయడం, సెలవులకు పని చేసి డబ్బు పొందడం వంటి నిబంధనలను హేతుబద్ధీకరించనున్నట్టు తెలిసింది. అలాగే, ఈ లేబర్ కోడ్‌లు వర్క్ ఫ్రమ్ హోమ్ మాడల్‌ను కూడా దృష్టిలో పెట్టుకున్నట్టు సమాచారం.

click me!