
భారతీయ రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. చెలామణిలో వున్న రూ.2000 నోటును ఉపసంహరించుకుంటామని ఆర్‌బీఐ ప్రకటించింది. అయితే అప్పటి వరకు ఈ నోట్లు చట్టబద్ధమైన చెల్లుబాటులోనే వుంటాయని తెలిపింది. చెల్లింపులు, లావాదేవీలు జరుపుకోవడానికి అప్పటి వరకు ప్రజలు వాటిని వినియోగించుకోవచ్చని అర్ధం . అయితే మీరు రూ.2000 నోటును మార్చుకోవాలంటే ఆర్‌బీఐ గుర్తింపు పొందిన బ్యాంక్, పోస్టాఫీస్, రిజర్వ్ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చు. బ్యాంక్ సాధారణ పనితీరుకు అంతరాయం కలగకుండా చూసేందుకు, ఒకేసారి రూ.20,000 పరిమితిని నిర్ణయించారు. అంటే, మే 23, 2023 నుండి, మీరు రూ.2000 నోట్లను ఒకేసారి రూ.20,000 వరకు మార్చుకోవచ్చు.
2000 డినామినేషన్ నోట్లను తక్షణమే రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం బ్యాంక్‌లకు ఆదేశాలు జారీ చేసింది. ఆర్‌బీఐ క్లీన్ నోట్ పాలసీ ప్రకారం ఈ మార్పు తీసుకొచ్చినట్లు సెంట్రల్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. 2016 నవంబర్‌లో రూ.500, రూ. 1,000 నోట్లను రద్దు చేసినప్పుడు వెంటనే రూ. 2,000 నోట్లను అందుబాటులోకి తెచ్చారు. పెద్ద మొత్తంలో నగదు రద్దు కావడంతో ప్రజల అవసరాలకు సరిపడా నగదు తక్కువ కాలంలో అందుబాటులోకి తెచ్చే క్రమంలో రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టారు. ఇతర డినామినేషన్లు (ఇతర నోట్లు) సరిపడా అందుబాటులోకి వచ్చాయని, కాబట్టి, రూ.2,000 అవసరం పూర్తయిందని ఆర్బీఐ తెలిపింది. 2018- 19లోనే రూ.2,000 నోట్ల ముద్రణ నిలిపేసినట్టు వివరించింది.
2000 రూపాయల నోట్లను ఎలా మార్చుకోవాలి..?
సెప్టెంబరు 30, 2023 వరకు రూ. 2,000 నోట్లకు డిపాజిట్ లేదా మార్పిడి సౌకర్యాలను అందించాలని ఆర్‌బీఐ బ్యాంకులను కోరింది. పౌరులు RS 2000 బ్యాంకు నోట్లను తమ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసుకోవచ్చు. లేదా ఏదైనా బ్యాంక్ బ్రాంచ్‌లో ఇతర డినామినేషన్‌ల నోట్లను తీసుకోవచ్చు. బ్యాంకు ఖాతాలలో జమ చేయాలనుకునే వారు ప్రస్తుతం అమల్లో వున్న చట్టబద్ధమైన నిబంధనలకు లోబడి చేయవచ్చు. మే 23, 2023 నుండి ఏ బ్యాంక్‌లోనైనా రూ. 2000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్లలోకి మార్చుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. సెప్టెంబర్ 30, 2023 వరకు రూ. 2,000 నోట్లను మార్పిడి సౌకర్యాలను అందుబాటులో వుంచాలని రిజర్వ్ బ్యాంక్ .. బ్యాంక్‌లను కోరింది.
రూ. 2000 బ్యాంకు నోట్లను సాధారణ లావాదేవీలకు ఎక్కువగా వినియోగించడం లేదు. వీటి వినియోగం క్రమంగా తగ్గిపోయింది. 2018 మార్చి 31వ తేదీ నాటికి ఈ నోట్ల వినియోగం 6.73 లక్షల కోట్ల నుంచి 3.62 లక్షల కోట్లకు (37.3 శాతం నోట్లు మాత్రమే చెలామణిలో ఉన్నాయి) పడిపోయింది. అదే 2023 మార్చి 31వ తేదీ నాటికి రూ. 2000 నోట్ల చెలామణి 10.8 శాతానికి క్షీణించింది. 2018-19లో రూ. 2000 నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.