రైతు సంఘాల భారత్ బంద్.. సాగు చట్టాలు అమలై ఏడాది నిండుతున్న సందర్భంగా పిలుపు

Published : Aug 27, 2021, 07:49 PM ISTUpdated : Aug 27, 2021, 07:58 PM IST
రైతు సంఘాల భారత్ బంద్.. సాగు చట్టాలు అమలై ఏడాది నిండుతున్న సందర్భంగా పిలుపు

సారాంశం

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన సాగు చట్టాలు అమల్లోకి వచ్చి వచ్చే నెల సెప్టెంబర్‌ 25వ తేదీతో ఏడాది నిండుతుంది. ఈ సందర్భంగా అదే రోజు భారత్ బంద్ పాటించాలని కిసాన్ సంయుక్త మోర్చా పిలుపునిచ్చింది. గతేడాది కూడా సెప్టెంబర్ 25న భారత్ బంద్ పాటించిన సంగతి తెలిసిందే.  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు వచ్చే నెల 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మూడు చట్టాలు అమల్లోకి వచ్చి సెప్టెంబర్ 25నాటికి ఏడాది నిండుతుంది. ఈ సందర్భంగా భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్టు సంయుక్త కిసాన్ మోర్చా వెల్లడించింది. అలాగే, దేశవ్యాప్తంగా తమ ఆందోళనలను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గతేడాది కూడా అదే తేదీన భారత్ బంద్ పిలుపునిచ్చినట్టు గుర్తుచేసింది. అప్పుడు కరోనా తాండవిస్తున్న సమయమని గుర్తుచేశారు. ఈ సారి భారత్ బంద్‌ను మరింత విజయవంతం చేయాలని అన్నారు. ఢిల్లీలోని సింఘు బార్డర్ దగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిసాన్ సంయుక్త మోర్చా నేత ఆశిశ్ మిట్టల్ ఈ విషయాలను వెల్లడించారు.

గురువారం, శుక్రవారం రైతులందరు ఒక కన్వెన్షన్‌ను నిర్వహించారు. ఈ సదస్సుకు కన్వీనర్‌గా ఆశిశ్ మిట్టల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సదస్సులో 22 రాష్ట్రాల నుంచి కనీసం 300 రైతు సంఘాలు పాల్గొన్నాయి. వీరితోపాటు మహిళలు, కార్మికులు, గిరిజనులు, యువత కోసం పనిచేసే సంఘాల నేతలూ పాల్గొన్నారు. తొమ్మిది నెలలుగా సాగుతున్న రైతుల ఆందోళనపై ఈ సదస్సులో చర్చ జరిగింది. ప్రభుత్వం ఏ విధంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులపై దాడి చేస్తున్నదో చర్చించామని ఆశిశ్ వివరించారు.

మూడు నూతన సాగు చట్టాలను రద్దు చేయడంతోపాటు కనీస మద్దతు ధరకు చట్టబద్ధతనివ్వడం, ఎలక్ట్రిసిటీ బిల్లును ఉపసంహరించాలనే డిమాండ్లను పునరుద్ఘాటించారు. గురువారం నాటికి రైతులు ఢిల్లీ సరిహద్దులకు వచ్చి నిరసనలు చేయడం ప్రారంభించి తొమ్మిది నెలలు నిండాయి. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం రైతులతో సంధికి చర్చలు చేసింది. పదిసార్లు రైతు ప్రతినిధులతో భేటీ అయింది. కానీ, ఫలితం తేలలేదు. సాగు రంగంలో విప్లవాత్మక సంస్కరణలు చేసినట్టు ప్రభుత్వం చెబుతుండగా, కొత్త చట్టాలతో కార్పొరేట్ల వద్ద సాగిలాపడే దుస్థితి రావొచ్చని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే