
ఉత్తరప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో చాలాచోట్ల పిడుగులు పడడంతో ఒక్క గురువారం రోజే 7 మంది మృత్యువాత పడ్డారు. యూపీలోని బుదౌన్, ఇటా, రాయ్ బరేలీ జిల్లాల్లో గురువారం జరిగిన పిడుగుపాటుకు ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఉషైత్ బజార్ ప్రాంతంలో రైతులు బబ్లూ (30), వర్జిత్ యాదవ్ (32)లు మోటర్‌బైక్‌పై వెళ్లుండగా.. భారీ వర్షంతో పాటు ఆ పిడుగులు పడ్డాయి. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారని డేటాగంజ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ధర్మేంద్ర కుమార్ సింగ్ తెలిపారు. ఉషైత్ పట్టణంలో జరిగిన మరో పిడుగుపాటులో అన్షిక(11) అనే బాలిక మృతి చెందింది. ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపామని, మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి ₹ 4 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని సింగ్ తెలిపారు. అలాగే.. రాయ్‌బరేలీలోని దిహ్, భడోఖర్, మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు వ్యక్తులు పిడుగుపాటుకు గురై మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గెండాలాల్ గ్రామ సమీపంలోని మోహిత్ పాల్ (14)అనే బాలుడు ఓ పొలంలో పశువులను మేపుతుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మిల్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని పూర్వా గ్రామంలో జమున ప్రసాద్ (38) అనే వ్యక్తి పొలంలో పని చేస్తుండగా పిడుగుపాటుకు గురయ్యాడు.
అలాగే.. భాదోఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాయ్‌బరేలీలోని సరాయ్ దామో గ్రామంలో రమాకాంతి (38)అనే వ్యక్తి పిడుగుపాటుకు గురై మృతి చెందింది. జిల్లాలో పిడుగుపాటుకు గురై మరో ముగ్గురు తీవ్రంగా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. అలాగే.. ఎటాహ్‌లోని ఖంజర్‌పూర్ గ్రామంలో ధర్మేంద్ర (32) తన పశువులకు మేత తీసుకురావడానికి భారీ వర్షం మధ్య బయట అడుగుపెట్టినప్పుడు పిడుగుపాటు కారణంగా మరణించాడని జైతర SHO ఖుషీరామ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపినట్లు తెలిపారు.