చంపేయ్: కుమారస్వామి ఆదేశాలు, వీడియో కలకలం

By pratap reddyFirst Published Dec 25, 2018, 8:05 AM IST
Highlights

కుమారస్వామి ఫోన్ లో చేసిన ఆదేశాలు రికార్డు కావడంతో దుమారం చెలరేగుతోంది. "ఆయన (ప్రకాష్) మంచి వ్యక్తి. ఈ రకంగా అతన్ని ఎవరు చంపారో తెలియదు. ఆ దుండగుడిని నిర్దాక్షిణ్యంగా చంపేయండి. ఏ సమస్యా రాదు" అని కుమార స్వామి అన్నారు.

బెంగళూరు:  ఫోన్ లో చేసిన మౌఖిక ఆదేశాలతో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వివాదంలో చిక్కుకున్నారు.  ఆ ఆదేశాలను ఆయన సీనియర్ పోలీసు అధికారికి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. తమ పార్టీ స్థానిక నేతను హత్య చేసిన వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా చంపేయండంటూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. 

కుమారస్వామి ఫోన్ లో చేసిన ఆదేశాలు రికార్డు కావడంతో దుమారం చెలరేగుతోంది. "ఆయన (ప్రకాష్) మంచి వ్యక్తి. ఈ రకంగా అతన్ని ఎవరు చంపారో తెలియదు. ఆ దుండగుడిని నిర్దాక్షిణ్యంగా చంపేయండి. ఏ సమస్యా రాదు" అని కుమార స్వామి అన్నారు. 

ఆ మాటలను ఓ స్థానిక జర్నలిస్టు రికార్డు చేశారు. ఆ వీడియో టేప్ లు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ మాటలు విని షాక్ తిన్నానని, అయితే ఉద్వేగంతో అన్న మాటలే తప్ప ఉద్దేశం అది కాదని కుమారస్వామికి సన్నిహితుడైన ఓ నేత అన్నారు. 

కుమారస్వామి కూడా అదే విధమైన వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా తాను ఇచ్చిన ఆదేశాలు కావని, కోపంలో అలా అన్నానని, అనుమానితులు మరో రెండు హత్య కేసుల్లో కూడా ఉన్నారని, వారు జైలులో ఉన్నారని, వాళ్లు మరో వ్యక్తిని చంపారని ఆయన అన్నారు. 

దక్షిణ కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జెడిఎస్ స్థానిక నేత ప్రకాష్ హత్యకు గురయ్యారు. ఇద్దరు వ్యక్తులు మోటారు బైకుపై వెంటాడి ప్రకాష్ కారును అడ్డగించారు. ఆ తర్వాత ప్రకాశ్ పై దాడి చేశారు. 

ఆ తర్వాత అతన్ని ఎస్ యువీలో తోసేశారు. అతన్ని మాండ్యా మెడికల్ సైన్సెస్ సంస్థకు తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు.

click me!