ఖ్యాలా ట్రిపుల్ మర్డర్ కేసు : ముగ్గురు నిందితులకు మరణశిక్ష ఖరారు..

By SumaBala Bukka  |  First Published Sep 6, 2023, 11:36 AM IST

ఢిల్లీలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ మర్డర్ కేసులో ఎనిమిదేళ్ల తరువాత తీర్పు వెలువడింది. ముగ్గురు నిందితులకు మరణశిక్ష పడింది. 


ఢిల్లీ :  ఖ్యాలా ట్రిపుల్ మర్డర్ కేసులో  ముగ్గురు నిందితులకు  ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు మంగళవారం మరణశిక్ష విధించింది. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన వివాహిత హత్యాచారం, ఆమె ఆమె పిల్లల హత్యల కేసులో ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. 2015లో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు తీర్పు వెలువడింది. ఈ ఘటనలో మొహమ్మద్ అక్రమ్, షాహిద్,  రఫత్ అలీ అనే ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చింది.

ఈ ముగ్గురు నిందితులు తమకు పరిచయమున్న ఓ వివాహిత మీద గ్యాంగ్ రేప్ చేసి అత్యంత దారుణంగా హతమార్చారు. ఆమెతోపాటు ఆమె పిల్లలు ఇద్దరు కూడా అంతమొందించారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న నగదు, డబ్బులతో పరార్ అయ్యారు. ఈ ఘటన వెలుగు చూడడంతో ఢిల్లీలో తీవ్ర సంచలనంగా మారింది.

Latest Videos

బెడిసికొట్టిన ఎదురుదాడి.. భారత రాజ్యాంగ ప్రవేశిక తప్పు కాపీని ట్వీట్ చేసిన కాంగ్రెస్.. మండిపడుతున్న బీజేపీ...

అదే ఏడు పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. అప్పటినుంచి కొనసాగుతున్న కోర్టు విచారణ ఎట్టకేలకు ఎనిమిదేళ్ల తర్వాత ముగిసింది. సుదీర్ఘ దర్యాప్తు తర్వాత పోలీసులు ఈ కేసులో పక్కా ఆధారాల్ని కోర్టులో సమర్పించారు. దీంతో స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ న్యాయమూర్తి అంచల్ మంగళవారం వీరికి శిక్ష ఖరారు చేశారు.

తీర్పు వెలువరించే సమయంలో జడ్జి తీర్పు కాపీని చదువుతూ… ‘బాధితురాలి భర్త పనిమీద ఊరికి వెళుతున్నాడని ఈ ముగ్గురు నిందితులకు తెలుసు. వీరు ఉద్దేశపూర్వకంగానే బాధితురాలు ఇంట్లోకి ప్రవేశించారు. కేసులో నిందితులు చేసిన ఈ కుట్ర స్పష్టంగా తెలుస్తోంది. ఆ తర్వాత వీరు అత్యంత పైశాచికంగా ప్రవర్తించారు. ఆమె మీద గ్యాంగ్ రేప్ చేయడమే కాకుండా.. ఆమెను, ఆమె బిడ్డలను కూడా చంపారు.  

అన్నింటికంటే అత్యంత ముఖ్యమైనది ప్రధాన నిందితుడు అక్రమ్ చేసిన నమ్మకద్రోహం. అతని మీద బాధితురాలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడు. అన్నా.. అని పిలిచే పిలుపుకు కళంకం తెచ్చాడు’ అని చెబుతూ న్యాయమూర్తి వీరికి మరణశిక్ష విధిస్తున్నట్లుగా తీర్పు చదివారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…

2015లో ఢిల్లీ రఘువీర్ నగర్ లో  ఈ ఘటన వెలుగు చూసింది.  బాధిత కుటుంబం రఘువీర్ నగర్ లో ఉండేది. అదే కాలనీలో నిందితుడు మహమ్మద్ అక్రమ్ కుటుంబం కూడా ఉంటుంది. అక్రమ్  బాధిత మహిళ కుటుంబంతో చనువుగా ఉండేవాడు. ఆ మహిళ అతడిని అన్నా అని పిలిచేది. అప్పుడప్పుడు ఇంటికి పిలిచి భోజనం కూడా పెట్టేది. అతని ప్రవర్తన మీద కానీ, వారి మీద కానీ ఎవరికి ఎలాంటి అనుమానాలు లేవు.  

వివాహిత భర్త ఓ రోజు పనిమీద జైపూర్ కు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాదాస్పద స్థితిలో మరణించి కనిపించారు. భార్య మెడకు దుపట్టా చుట్టి ఉంది. కూతురి మెడకు కర్చీఫ్ తో ఉరివేసి కనిపించింది. ఇంట్లో దోపిడీ జరిగిన ఆడవాళ్లు స్పష్టంగా ఉన్నాయి. వెంటనే భర్త పోలీసులకు సమాచారం అందించాడు.  

2015 సెప్టెంబర్ 21వ తేదీన ఈ ఘటన చోటుచేసుకుంది. పోస్టుమార్టం నివేదికలో వివాహిత అత్యాచారానికి గురైందని, ఆమెను పదునైన ఆయుధంతో హత్య చేశారని తెలిసింది. ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వీరితో సన్నిహితంగా ఉండే అక్రమ్ పై అనుమానాలు వచ్చాయి. దీంతో అదే ఏడాది అక్టోబర్లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతనితోపాటు షాహిద్ ను అరెస్టు చేశారు.  విచారణలో వీళ్ళు చెప్పిన సమాచారంతో ఘటన జరిగిన సమయానికి మైనర్ గా ఉన్న రఫత్ అనే మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు. 

అతనిని జువైనల్ హోమ్ కి తరలించారు. ఆ తర్వాత ఈ కేసు విచారణకు వచ్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనాలు…నిందితుల ఫోన్ కాల్స్ రికార్డ్ అయిన సమయం… ఇలా అనేక రకాల సాక్ష్యాధారాలను పోలీసులు పరిశీలించారు. సుదీర్ఘంగా సాగిన దర్యాప్తు తర్వాత 2023 ఆగస్టు 22వ తేదీన ఈ ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ మరణశిక్ష విధించింది న్యాయస్థానం.
 

click me!