మే నెల తర్వాత మళ్లీ 30 వేలు దాటిన కరోనా కేసులు.. ఒక్క రోజే 31శాతం పెరుగుదల

By telugu teamFirst Published Aug 25, 2021, 7:56 PM IST
Highlights

కేరళలో కరోనా కేసులు ఒక్క రోజులోనే 30శాతం పెరిగాయి. మే నెల తర్వాత మళ్లీ 30వేల మార్క్‌ను దాటాయి. ఓనమ్ పండుగ సందర్భంగా ప్రజలు వేడుకలు చేసుకోవడం ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాప్తి చెంది ఉండొచ్చనే అనుమానాలున్నాయి.
 

తిరువనంతపురం: కేరళలో కరోనా కేసులు ఆందోళనకరంగా పెరిగాయి. సింగిల్ డే లోనే 31శాతం కేసులు పెరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నది. ఆ రాష్ట్రంలో మే నెల తర్వాత తొలిసారిగా కేసులు మళ్లీ 30వేల మార్క్‌ను దాటాయి. రాష్ట్ర ప్రజలు ఓనమ్ పండుగ వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో కేసులు విపరీతంగా పెరగడం గమనార్హం.

కేరళలో బుధవారం 31,445 కొత్త కేసులు నమోదయ్యాయి. 215 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. పాజిటివిటీ రేటు 19.03శాతానికి చేరింది. ఫలితంగా రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,83,429కి చేరగా, మరణాల సంఖ్య 19,972కు పెరిగింది. బుధవారం అత్యధిక కేసులు(4,048) రాష్ట్రంలోని ఎర్నాకుళంలో నమోదయ్యాయి.

ఓనమ్ వేడుకల సందర్భంగా ప్రజలు గుమిగూడే అవకాశాలు ఎక్కువ ఉంటాయని, కాబట్టి, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ సూచించిన తర్వాతి రోజే రికార్డు కేసులు నమోదవడం గమనార్హం. కేంద్ర మంత్రి మురళీధరన్ రాష్ట్ర సీఎం పినరయి విజయన్‌పై విమర్శలు చేశారు. కరోనా కట్టడిలో పినరయి విఫలమయ్యారని ఆరోపించారు. 

దేశంలో థర్డ్ వేవ్ మళ్లీ ముంచుకొచ్చే ముప్పు ఉన్నదని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణల కమిటీ అంచనా వేసిన సంగతి తెలిసిందే.

click me!