
Monkeypox Case: గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని కరోనా రక్కసి పట్టిపీడుస్తుంది. కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇదే క్రమంలో కొత్త కొత్త వేరియంట్స్ పుట్టుక వస్తూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరుణంలో మంకీపాక్స్ వేరియంట్ రూపంలో మరో మహమ్మారి ప్రజలను భయపెడుతోంది. తాజాగా కేరళలో మంకీపాక్స్ కలకలం రేగింది. ఇటీవల యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి తిరిగి వచ్చిన ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వేరియంట్ లక్షణాలు బయటపడ్డాయి. సదరు వ్యక్తిలో అధిక జ్వరం, శరీరంపై బొబ్బలు ఉన్నాయి. సమాచారం ప్రకారం.. ఆ వ్యక్తి నుంచి నమూనా సేకరించి.. నిర్ధారణ కోసం పూణేలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపబడింది. సాయంత్రానికి నివేదిక వస్తుందని చెబుతున్నారు.
ఈ విషయంపై కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ స్పందించారు. కేరళలో మంకీపాక్స్ అనుమానిత కేసు నమోదైందని తెలిపారు. మూడు రోజుల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి తిరిగి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం ఆ వ్యక్తిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్టు తెలిపారు.
అయితే.. భయాందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. మంకీపాక్స్ (ఆర్థోపాక్స్ వైరస్) సోకిందని నిర్ధారించేందుకు ఆరోగ్య శాఖ సదరు వ్యక్తి నమూనాలను పూణే వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు పంపిందని, ఈ సాయంత్రానికి నివేదిక అందుతుందని తెలిపారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఈ సమయంలో కరోనాతో పాటు ప్రపంచంలోని అనేక దేశాలలో చాలా తీవ్రమైన వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రపంచంలోని 27 దేశాల్లో దాదాపు 800 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం.. జూన్ 2 నాటికి, ప్రపంచంలోని 27 దేశాలలో 780 మంకీ పాక్స్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ఎండిమిక్ దశలో లేని ప్రాంతాల్లో వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతోంది. మే 29 నాటికి 257 కేసులు నమోదు కాగా, జూన్ 2 నాటికి.. ఆ సంఖ్య 780కి పెరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించకపోవడం ఊరట నిచ్చే అంశం. అయినా.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.