
Kerala: సమాజంలో నేరప్రవృత్తి, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, పెరుగుతున్నాయి. మానవ సంబంధాలు, అనుబంధాలు పూర్తిగా మరిచిపోతున్నారు. సమాజంలో అనునిత్యం హత్యలకు పాల్పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోంది. చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్న వారు కుటుంబాలకు కుటుంబాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఆస్తి తగాదాలతో తమ్ముడిని దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు ఓ సోదరుడు. అడ్డువచ్చిన బంధువులపై కూడా కాల్పులు జరిపాడు. తానే హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన కేరళలోని జిల్లా కొట్టాయం జిల్లాలో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. కొట్టాయం జిల్లా కంజిరపల్లికి చెందిన జార్జ్ కురియన్, రెంజు కురియన్ సోదరులు. వీరిద్దరి మధ్య కుటుంబ ఆస్తి అమ్మకం విషయంలో వివాదం చెలరేగింది. గత కొంత కాలంగా.. సోదరుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదాన్ని బంధువుల సమక్షంలో పరిష్కరించుకోవాలని సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సమావేశమయ్యారు.
ఈ తరుణంలో సోదరుల మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో నిందితుడు తన రివాల్వర్‌ను తీసి.. అతని సోదరుడిపై కాల్చాడు. తలపై బుల్లెట్ గాయం కావడంతో రెంజూ అక్కడికక్కడే మృతి చెందగా, ఇరువురిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్కారియాకు కూడా బుల్లెట్ గాయమైంది. అతన్ని కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు, అక్కడ అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని అధికారి తెలిపారు.
దాడికి పాల్పడిన నిందితుడు లైసెన్స్ ఉన్న ఆయుధాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచనున్నారు. కొట్టాయం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శిల్పా దేవయ్య సహా సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నిందితుడి పై హత్య కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇల్లు అమ్మడానికి కన్న తండ్రి ఒప్పుకోలేదని... గొంతు కోసి నిప్పంటించిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినిత్ కుమార్ అనే యువకుడు.. గత వారం రోజులుగా.. తండ్రితో గొడవ పడుతున్నాడు. ఎందుకంటే.. అప్పులు కావడంతో తన ఇంటిని అమ్మడానికి పెట్టాడు. కానీ, ఆయన తండ్రి ఏ మాత్రం ఒప్పుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న వినిత్ కుమార్ కన్నతండ్రిని గొంతు కోసి చంపాడు. అతను అక్కడితో ఆగకుండా తండ్రి శవాన్ని దుప్పటిలో చుట్టి కాల్చేశాడు.
అయితే స్థానికులు సమాచారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందుతుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అంతేగాక నిందుతుడు నేరం చేసినట్లు అంగీకరించాడని కూడా చెప్పారు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మృతుడి భార్య ఆశాదేవి తన కుమార్తెతో కలిసి ఆగ్రాలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిందని తెలిపారు.