ప్రియా వర్గీస్ నియామకంపై వివాదం: వర్సిటీ నియామకాల్లో బంధుప్రీతి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తాను.. కేరళ గవర్నర్

By Sumanth KanukulaFirst Published Aug 20, 2022, 1:35 PM IST
Highlights

కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌పై కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ మండిపడ్డారు. ఆయన సీఎం క్యాడర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీలో అన్ని కీలక పోస్టింగ్‌లలో బంధుప్రీతి ఉందని ఆరోపించిన ఆయన.. అటువంటి నియామకాలన్నింటిపై త్వరలో విచారణకు ఆదేశిస్తానని స్పష్టం చేశారు.

కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌పై కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్ మండిపడ్డారు. ఆయన సీఎం క్యాడర్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. యూనివర్సిటీలో అన్ని కీలక పోస్టింగ్‌లలో బంధుప్రీతి ఉందని ఆరోపించిన ఆయన.. అటువంటి నియామకాలన్నింటిపై త్వరలో విచారణకు ఆదేశిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో వివిధ ఉద్యోగాల నియామకాల్లో బంధుప్రీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తానని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శనివారం తెలిపారు. 

‘‘ప్రొఫెసర్ నుండి దిగువ సిబ్బంది వరకు.. వారు వారి సంబంధీకులను కలిగి ఉండాలని కోరుకుంటారు. గత రెండు, మూడు సంవత్సరాలలో ఎన్ని నియామకాలు జరిగాయో ఇప్పుడు నేను పూర్తి స్థాయి విచారణ చేయబోతున్నాను’’ కేరళ గవర్నర్ చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఈ తరహా నియామకాలకు సంబంధించి వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. మరోవైపు ఛాన్సలర్‌గా యూనివర్సిటీ వ్యవహారాల్లో గవర్నర్ అధికారాలను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

కన్నూర్ యూనివర్సిటీలో మలయాళ అసోసియేట్ ప్రొఫెసర్‌గా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రైవేట్ సెక్రటరీ కెకె రాగేష్ భార్య ప్రియా వర్గీస్‌ నియామకంపై గవర్నర్ అరీఫ్ మహమ్మద్ ఖాన్ స్టే విధించిన సంగతి తెలిసిందే. అయితే అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ప్రియా వర్గీస్‌ నియామకంపై గవర్నర్‌ స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం హైకోర్టును ఆశ్రయించాలని యూనివర్సిటీ సిండికేట్‌ నిర్ణయించింది. యూనివర్సిటీ వైస్‌ఛాన్సలర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయకుండా గవర్నర్ ఉత్తర్వులు జారీచేయడం బైండింగ్‌లో లేవని పేర్కొంది. అయితే చివరి నిమిషంలో ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గింది.

ఇక, ప్రియా వర్గీస్‌ను కన్నూర్ విశ్వవిద్యాలయం మలయాళ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా నియమించాలని ప్రతిపాదించింది. ఆమెకు పరిశోధనలో అత్యల్ప స్కోర్‌ని కలిగి ఉంది. అయితే ఇంటర్వ్యూ రౌండ్‌లో అత్యధిక స్కోర్‌ను సాధించింది. అలాగే ఎంపిక ప్రక్రియలో మొదటి స్థానంలో నిలిచింది. ఇది కాస్తా కేరళలో భారీ రాజకీయ వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఆమె నియామకంపై గవర్నర్ స్టే విధించారు. 

అయితే తన ఆదేశాలను సవాలు చేస్తూ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ గోపీనాథ్‌ రవీంద్రన్‌.. తనకు వ్యతిరేకంగా మాట్లాడంపై చర్యలు తీసుకోవాలని యోచిస్తన్నారు. ఇది ఘోరమైన దుష్ప్రవర్తన, తీవ్రమైన ఉల్లంఘన అని గవర్నర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కన్నూర్ యూనివర్శిటీలో మలయాళ అసోసియేట్ ప్రొఫెసర్ నియామకాన్ని నిలిపివేస్తూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తీసుకున్న నిర్ణయం ‘‘రాజ్యాంగ విరుద్ధం’’ అని సీపీఐ(ఎం) అభివర్ణించింది.

ఇక, యూనివర్సిటీ చట్టం ప్రకారం.. వైస్ ఛాన్సలర్‌పై గవర్నర్ విచారణ చేసే అవకాశం ఉంది. అయితే అటువంటి విచారణ కోసం హైకోర్టు లేదా సుప్రీం కోర్టు న్యాయమూర్తిని తప్పనిసరిగా నియమించాలి. అక్రమాలు లేదా నిధుల దుర్వినియోగం జరిగినట్లు తేలితే వైస్-ఛాన్సలర్‌ను ఆ పదవి నుండి తొలగించవచ్చు.

click me!