కాంగ్రెస్ పార్టీకి ఏకే ఆంటోనీ కొడుకు రాజీనామా.. మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని వ్యతిరేకించిన మరుసటి రోజే నిర్ణయం

By Mahesh KFirst Published Jan 25, 2023, 2:57 PM IST
Highlights

కేరళ మాజీ సీఎం ఎకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడుతున్న వారు తన ట్వీట్ తొలగించాలని హెచ్చరించారని వివరించారు. అందుకే పార్టీలో నుంచి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. 
 

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ, గుజరాత్ అల్లర్లపై బ్రిటన్‌కు చెందిన బీబీసీ తీసిన రెండు పార్టుల బీబీసీ డాక్యుమెంటరీని కాంగ్రెస్ సీనియర్ లీడర్, కేరళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ కే ఆంటోనీ వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ వైఖరికి భిన్నంగా ఆయన తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించారు. తాజాగా, ఆయన కాంగ్రెస్ పార్టీకే రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. తన భిన్నాభిప్రాయంతో పార్టీ నేతల నుంచి దూషణలు, బెదిరింపులు, ద్వేషం వచ్చిందని పేర్కొన్నారు. అందుకే తాను పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు వివరించారు.

‘కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ యూనిట్ నుంచి అన్ని బాధ్యతలకు రాజీనామా చేశాను. భావ ప్రకటన స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని చెప్పుకునే కొందరు తన ట్వీట్‌ను తొలగించాలని అంగీకరించలేని రీతిలో కాల్స్ చేశారు. కానీ, నేను తిరస్కరించాను. ప్రేమను పంచుతున్నామని చెప్పే కొందరు (రాహుల్ గాంధీ యాత్రను ఉద్దేశించి!) ఫేస్‌బుక్ వాల్‌లో ద్వేషాన్ని చిమ్మారు. దీన్నే హిపోక్రసీ అని అనవచ్చు. జీవితం సాగిపోతుంది’ అని ఆయన ట్వీట్ చేశారు. సవరించిన తన రాజీనామా లేఖనూ ఆయన పోస్టు చేశారు. 

Also Read: బీబీసీ డాక్యుమెంటరీని సపోర్ట్ చేయడం దేశానికే డేంజర్: కాంగ్రెస్ ఏకే ఆంటోనీ కుమారుడి అనూహ్య స్పందన

నిన్న తాను బీబీసీ డాక్యుమెంటరీ పై ట్వీట్ చేసినప్పటి నుంచి ఫోన్ మెస్సేజీలు, కాల్స్ వస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. 

కేరళ కాంగ్రెస్ డిజిటల్ మీడియా కన్వీనర్‌గా కొనసాగినప్పుడు సహకరించిన కాంగ్రెస్ లీడర్ శశిథరూర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామా లేఖలో అనిల్ తన సహచరులు, కొందరు పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. తనకు ఉన్న ప్రత్యేక శక్తి యుక్తులతో పార్టీకి వీలైన అన్ని మార్గాల్లో సహకరించి ప్రభావవంతం చేశానని వివరించిన అనిల్ ఆంటోనీ, ఇప్పుడు తనకు కొన్ని వాస్తవాలు తెలిసొచ్చాయని తెలిపారు. మీరు, మీ కొలీగ్స్, మీ కోటరీలు, పార్టీ అధినాయకత్వం చుట్టూ ఉన్న మీరు కేవలం సైకోఫాంట్లు, చంచాలతో మాత్రమే పని చేస్తారని తెలిసిందని ఆరోపించారు. వారు మిమ్మల్ని ప్రశ్నించకుండా పడి ఉంటారని, ఇదే కేవలం మీరు చూసే ఏకైక క్రైటీరియా అని పేర్కొన్నారు. అందుకే నాకు, మీకు ఉమ్మడి అంశాలు చాలా తక్కువ అని తెలిపారు.

click me!