కేరళ.. ఇళ్లల్లోకి పాములు.. ఇప్పుడు వాళ్లే అవసరం

By ramya neerukondaFirst Published 23, Aug 2018, 2:40 PM IST
Highlights

ప్రజలంతా ఒక్కొక్కరుగా తమ సొంత ఇళ్లకు చేరుకుంటున్నారు. అయితే.. అక్కడికి వెళ్లాక.. వారి గుండెలు ఆగినంత పని అవుతున్నాయి.
 

భారీ వర్షాలకు అతలాకుతలమైన కేరళ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి.దీంతో.. వరదలు కూడా నెమ్మదిగా తగ్గుతున్నాయి. దీంతో పునరావాస కేంద్రాల్లో ఇన్ని రోజులు తలదాచుకున్న ప్రజలంతా ఒక్కొక్కరుగా తమ సొంత ఇళ్లకు చేరుకుంటున్నారు. అయితే.. అక్కడికి వెళ్లాక.. వారి గుండెలు ఆగినంత పని అవుతున్నాయి.

ఎందుకంటే.. ఏ ఇంట్లో చూసినా.. పాములు, మొసళ్లే కనపడుతున్నాయి. వాటిని తరిమేందుకు కేరళ ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కేరళ గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పెద్ద ఇల్లుంటాయి. వాటిని శుభ్రపరిచేందుకు పది రోజులైనా పడుతుందని అంటున్నారు. పైగా అందరూ వరద బాధితుల కావడంతో పనులు చేసేందుకు ఎవరూ ముందుకురాని పరిస్థితి. 

ఎంత సంపన్నులైనా ఎవరి ఇళ్లు వారే శుభ్రం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. సర్వం కోల్పోయినవాళ్లు ఇప్పుడు మానసిక క్షోభకు గురవుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే తమ కుటుంబసభ్యులకు ఉద్యోగాలు పోయి, ఇక్కడ సొంతిళ్లు దెబ్బతిని నిలువ నీడలేనివాళ్లు అనేకమంది ఉన్నారు. చేతిలో చిల్లిగవ్వలేదని సహాయ శిబిరాల్లోంచి ఇళ్లకు వస్తే ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడంలేదని వాపోతున్నారు. జనం మానసిక ఒత్తిడికి లోనై స్థిమితం కోల్పోయే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. కేరళ ప్రజలకు ఇప్పుడు సైకాలజిస్టులు, సైక్రియాటిస్టుల అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.

Last Updated 9, Sep 2018, 12:07 PM IST