కేరళను ముంచెత్తుతున్న వర్షాలు... ప్రమాదంలో ముళ్లపెరియార్ డ్యామ్

By sivanagaprasad KodatiFirst Published Aug 15, 2018, 4:54 PM IST
Highlights

 పర్యాటక రంగానికి మణిహారంగా పేర్గాంచిన కేరళ వరుణిడి ఆగ్రహంతో వణుకుపోతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ  కకావికలంగా మారింది.

కొచ్చి:  పర్యాటక రంగానికి మణిహారంగా పేర్గాంచిన కేరళ వరుణిడి ఆగ్రహంతో వణుకుపోతుంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ  కకావికలంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో అల్లకల్లోలంగా మారింది కేరళ. జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. శతాబ్ద కాలంలో ఎన్నడూ చూడని విధంగా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో ఇప్పటికే 45మంది మృతిచెందారు. దీంతో 12 జిల్లాల్లో వాతావరణశాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. డ్యాములలోకి వరద నీరు విపరీతంగా వచ్చి చేరుతుండటంతో దాదాపు 30 డ్యాములు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.    

ఇదిలా ఉంటే కేరళలో పురాతన డ్యామ్ ముళ్లపెరియార్‌ డ్యామ్‌. ఈ డ్యామ్ కు భారీగా వరదనీరు వచ్చిచేరుతుండటంతో నిండికుండను తలపిస్తుంది. ముళ్లపెరియార్ డ్యామ్ ఎత్తు 142 అడుగులు కాగా నీటి మట్టం 142 అడుగులకు చేరుకోవడంతో  ఎప్పుడు ఏ ఉపద్రవం సంభవిస్తుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 

అటు అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. ముళ్లపెరియార్‌ డ్యామ్‌లో నీటిని కిందకు వదిలేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ముళ్ల పెరియార్ డ్యామ్ నిర్వహణ అంంతా తమిళనాడు ప్రభుత్వం చేతిలో ఉండటంతో ఆ రాష్ట్ర అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఈ డ్యామ్‌ భద్రతపై తమిళనాడు, కేరళ మధ్య వివాదం ఏళ్ల తరబడి నడుస్తోంది. ప్రస్తుతం భారీగా వరద చేరుతుండటం..డ్యామ్‌ సామర్థ్యాన్ని మించి నీటిమట్టం పెరిగితే భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో అధికారులు స్లిప్‌వేస్‌ నుంచి నీటిని దిగువకు వదలుతున్నారు. 

 
భారీ వర్షాల ప్రభావం కొచ్చి విమానాశ్రయానికి తాకింది. విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో వరద నీరు నిలిచిపోవడంతో నాలుగు రోజులపాటు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అటు వర్షాల కారణంగా కేరళ ప్రజలు ఘనంగా నిర్వహించే నం ఉత్సవాలు సైతం రద్దయ్యాయి.  

కేరళలో ఓనం ఉత్సవాలను రద్దు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. రాష్ట్ర పండుగగా ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. అందుకు ప్రతీ ఏడాది 30 కోట్ల రూపాయలు విడుదల చేస్తుంది. అయితే ఓనం పండుగ కోసం కేటాయించిన 30 కోట్ల నిధులను సీఎం సహాయనిధికి మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
 

click me!