
Kerala: కేరళలో చోటుచేసుకుంటున్న రాజకీయ నేపథ్యం కలిగిన హత్యలు కలకలం రేపుతున్నాయి. పాలక్కాడ్ జిల్లాలో శనివారం స్థానిక ఆరెస్సెస్ నాయకుడిని అత్యంత క్రూరంగా నరికి చంపారు. ఇదే ప్రాంతంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) నాయకుడు హత్య చేయబడిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది. ఆరెస్సెస్ నాయకుడి హత్య వెనుక PFI, దాని రాజకీయ విభాగం సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డీపీఐ) హస్తం ఉందని పాలక్కాడ్‌లోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా నాయకత్వం ఆరోపించింది.
కత్తుల దాడికి గురై ప్రాణాలు కోల్పోయిన మృతుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) మాజీ ప్రచారక్ శ్రీనివాసన్ (45)గా పోలీసులు గుర్తించారు. నగరంలోని మేల్మూరిలో మధ్యాహ్నం 1 గంటల సమయంలో అతని దుకాణంలోకి ఒక ముఠా చొరబడి అతన్ని చాలాసార్లు నరికి చంపిందని, అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, రక్షించలేకపోయారని పోలీసులు తెలిపారు. ఐదుగురు సభ్యుల ముఠా ద్విచక్రవాహనాలపై వచ్చి కత్తులు చేతపట్టి శ్రీనివాసన్‌ను పలుమార్లు నరికి చంపినట్లు ప్రత్యక్ష సాక్షుల వెల్లడించారని పోలీసులు పేర్కొన్నారు.
ఇదిలావుండగా, శుక్రవారం మధ్యాహ్నం, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) ఎలపుల్లి ఏరియా చీఫ్ ఎ సుబైర్ (44).. అతని తండ్రి అబూబకర్ తో ప్రార్థనలు చేయడానికి వెళ్ళిన స్థానిక మసీదు సమీపంలో హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. దుండగులు ఉపయోగించిన కారు, నిందితుల పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని పేర్కొన్నారు. అయితే, గత ఏడాది నవంబర్‌లో పీఎఫ్‌ఐ-ఎస్‌డిపిఐతో సంబంధమున్న వ్యక్తులు హత్య చేసిన ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు ఎస్ సంజిత్ పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. సంజిత్ కుటుంబీకులు కారు అతనిదేనని ధ్రువీకరించారు. అయితే అతను చనిపోవడానికి నెలల ముందు వర్క్‌షాప్‌లో వదిలివేసినట్లు పోలీసులు తెలిపారు. వర్క్‌షాప్ నుంచి కారును ఎవరు తీసుకెళ్లారో నిర్ధారించలేకపోయారు. ఈ హత్యకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), RSS (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్)లు కారణమని పీఎఫ్ఐ ఆరోపించింది. ఈ ఆరోపణను పాలక్కాడ్‌లోని BJP నాయకత్వం ఖండించింది.
శనివారం జరిగిన దాడి వెనుక ఎస్‌డీపీఐ, పీఎఫ్‌ఐ హస్తం ఉందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి కృష్ణకుమార్ ఆరోపించారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్యను పోలీసులు అడ్డుకోలేకపోయారు. మేము ఇప్పటికే PFI కార్యకర్త హత్య వెనుక మా కార్యకర్తలు లేదా సంఘ్ పరివార్ వ్యక్తుల పాత్రను ఖండించాము”అని ఆయన చెప్పారు. కాగా, గత ఐదు నెలల్లో పాలక్కాడ్ జిల్లాలో శనివారం జరిగిన మూడో రాజకీయ హత్య కావడం గమనార్హం.