
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో వేరువేరు మతాలకు చెందిన ఓ జంట పారిపోయి వివాహం చేసుకుంది. అయితే, అంతకుముందు హిందు కుటుంబానికి చెందిన ఆ యువతిని ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తూ.. రైట్ వింగ్ గ్రూపులు ఆందోళనకు దిగాయి. స్థానికంగా దుకాణాలు, అన్ని రకాల షాపులు మూసివేసి నిరసనకు దిగాయి. ఈ క్రమంలోనే అమ్మాయిని కిడ్నాప్ చేశాడని ఆరోపించబడిన వారి ముస్లిం ఇండ్లకు రైట్ వింగ్ గ్రూప్ సభ్యులు నిప్పుపెట్టారు. దీంతో అక్కడ ఆందోళకర పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఈ చర్యలకు పాల్పడిన ఏనిమిది మంది రైట్ వింగ్ సభ్యులను అరెస్టు చేశారు. వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రాలోని రునక్తా ప్రాంతంలో నివాసముంటున్న ఓ హిందు యువతి కనిపించకుండా పోయింది. అక్కడే ఉంటున్న ముస్లిం యువకుడు కూడా కనిపించకపోవడంతో అమ్మాయి కుటుంబం.. ఆ యువకుడే తమ బిడ్డను కిడ్నాప్ చేశాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే గ్రామంలో పంచాయతీ కుడా నిర్వహించారు. ఈ విషయంపై అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా ఉన్న హిందువులు.. ఆరోపిత ముస్లిం కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే రైట్ వింగ్ గ్రూప్ ధర్మ్ జాగరణ్ సమన్వయ్ సంఘ్ కు చెందిన సభ్యులు ఆ రెండు ముస్లిం కుటుంబాల ఇంటికి నిప్పు పెట్టారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ చర్యలు పాల్పడిన వారిపై కొరడా ఝుళిపించారు. ఎనిమిది మంది రైట్ వింగ్ గ్రూప్ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సికంద్రా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ పాత్రపై విచారణ జరుగుతుండగా, బూత్ ఇన్‌చార్జిని సస్పెండ్ చేశారు.
దీనిపై విచారణ జరుపుతున్న పోలీసులు మాట్లాడుతూ.. ఈ మతాంత జంట ఇష్టపూర్వకంగానే పారిపోయిందనీ, ఏప్రిల్ 12న ఢిల్లీలోని ఆర్యసమాజ్ లో పెండ్లి కూడా చేసుకున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఓ వీడియోలో ఆ యువతి మాట్లాడుతూ.. "మేము పెద్దవాళ్లం. మేమిద్దరం మా ఇష్టంతో కలిసి వచ్చి పెళ్లి చేసుకున్నాం. దయచేసి మా వల్ల మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి. నేను వచ్చి కోర్టు ముందు నా వాంగ్మూలాన్ని నమోదు చేస్తాను" అని చెప్పింది.
ఇక పెళ్లికి ముందు ఆ ముస్లిం యువకుడు హిందూ మతంలోకి మారాడు. అతను దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.."ఎటువంటి బలవంతం లేదా అనవసరమైన ప్రభావం లేకుండా తన స్వేచ్ఛా సంకల్పంతో మారుతున్నట్టు చెప్పాడు. ఏప్రిల్ 12 నుండి కొత్త పేరు సాహిల్ అనే కొత్త పేరుతో పిలవబడతాడని ఆ అఫిడవిట్ పేర్కొంది. SSP సుధీర్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, "ధరమ్ జాగరణ్ సమన్వయ్ సంఘ్ సభ్యులు యువకుని బంధువుల ఇళ్లకు నిప్పుపెట్టి పారిపోయారు. పరిస్థితి అదుపులో ఉంది. ఆ ప్రాంతంలో పోలీసు బలగాలను మోహరించాం... వారి ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నారు" అని తెలిపారు.