సిసోడియాకు సీబీఐ,మోడీ క్లీన్ చిట్.. లిక్కర్ స్కామ్ పై సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

By Rajesh KarampooriFirst Published Nov 26, 2022, 3:08 PM IST
Highlights

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం సిసోడియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చారన్నారు. సీబీఐ చార్జిషీట్ లో సిసోడియా పేరు లేదని, ఆయనకు వ్యతిరేకంగా సీబీఐకి ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఆప్ పై విమర్శలకు మోడీ 18గంటలు పనిచేస్తున్నారన్నారు. రెండు గంటలు ప్రజల కోసం ఉపయోగిస్తే.. నిరుద్యోగం, అధిక ధరలు తగ్గుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

లిక్కర్ స్కామ్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు ఆమ్ ఆద్మీ పార్టీ 10వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో  బీజెపిపై తీవ్ర స్థాయిలో విరుచుక పడ్డారు. ప్రధాని మోడీ తన మంత్రి మనీష్ సిసోడియా కేసును వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు సీబీఐ,ఈడీ డైరెక్టర్లను కూడా ప్రధాని కలిశారని అన్నారు. సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించాలని,అందుకోసం సిబిఐ, ఈడీ చీఫ్‌లను ఏదైనా చేయమని వారికి సూచించేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కానీ.. వారు తమ మొత్తం దర్యాప్తులో సిసోడియాకు వ్యతిరేకంగా ఏమీ కనుగొనలేకపోయారని కేజ్రీవాల్ అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసిందని, అందులో మనీష్ సిసోడియా పేరు ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు.ఒక విధంగా చూస్తే.. సిసోడియాకు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిందని, దాదాపు 800 మంది అధికారులు ఈ కేసుపై పనిచేస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు. కానీ, మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా వారు ఏమీ కనుగొనలేకపోయారనీ, ఈ కేసులో సిసోడియాకు వ్యతిరేకంగా కనీసం రుజువు దొరికినా.. వారు అతనిని అరెస్టు చేసి ఉండేవారని అన్నారాయన.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీలు చేపట్టిన దాడుల గురించి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సిసోడియాకు సంబంధించిన 500 చోట్ల దాడులు చేశారని, గోడలు పగలగొట్టారని, పరుపు చిరిగిపోయిందని,బ్యాంక్ లాకర్‌ను తనిఖీ చేశారని, అయితే వారికి ఎలాంటి నగదు లభించలేదని పేర్కొన్నారు.

డిప్యూటీ సిఎం సిసోడియా అత్యంత నిజాయితీపరుడని గర్వంగా చెప్పగలనని పేర్కొన్న అరవింద్ కేజ్రీవాల్..ఈ దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడు ప్రజల ముందు నిలబడి వారు అత్యంత నిజాయితీపరులు అని చెప్పలేరని నొక్కి చెప్పారు .

ఆప్ స్థాపన దినోత్సవం
AAPని నవంబర్ 26, 2012లో కేజ్రీవాల్ స్థాపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ 10 సంవత్సరాల క్రితం ఈ రోజున స్థాపించబడింది, ఈ 10 సంవత్సరాలలో ప్రజల యొక్క అపారమైన ప్రేమ, కార్మికుల కృషితో, పార్టీ భారతదేశ రాజకీయాల్లో అనేక చరిత్రలను సృష్టించిందని కేజ్రీవాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

click me!