ఢిల్లీలో అల్లర్లు, లూటీలు: పోలీసులపై కేజ్రీవాల్ తీవ్ర వ్యాఖ్యలు

By telugu teamFirst Published Feb 25, 2020, 11:50 AM IST
Highlights

ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని ఆయన కోరారు. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు చొరబడుతున్నట్లు తనకు సమాచారం ఉందని కేజ్రీవాల్ అన్నారు.

న్యూఢిల్లీ: ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈశాన్య ఢిల్లీ ఎమ్మల్యేలతో సమావేశమైన తర్వాత ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

శాంతియుత వాతావరణాన్ని కాపాడాల్సిందిగా ఆయన ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పలువురు పోలీసులు, పౌరులు గాయపడ్డారని, కొంత మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన అన్నారు. పలు ఇళ్లకు, దుకాణాలకు నిప్పు పెట్టారని, ఇది అత్యంత దురదృష్టకరమని ఆయన అన్నారు.

పోలీసుల కొరత తీవ్రంగా ఉందని, పై నుంచి ఆదేశాలు వచ్చే వరకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని అల్లర్లు చెలరేగుతున్న ప్రాంతాల్లోని ఎమ్మెల్యేలు చెప్పినట్లు ఆయన తెలిపారు. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పోలీసుల సహకారంతో పీస్ మార్చ్ చేయాలని జిల్లా మెజిస్ట్రేట్లకు సూచించినట్లు ఆయన తెలిపారు. 

Also Read: ఢిల్లీలో అల్లర్లు, లూటీలు: 7కు చేరిన మృతుల సంఖ్య, మరోసారి షా భేటీ

ఇతర ప్రాంతాల్లోంచి అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు కొంత మంది చొరబడుతున్నట్లు తనకు ఎమ్మెల్యేలు చెప్పినట్లు ఆయన తెలిపారు. సరిహద్దులను మూసేసి, ముందస్తు అరెస్టు చేయాలని ఆయన సూచించారు. 

ఈశాన్య ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఘర్షణ పడడంతో తీవ్ర హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. సీఏఏ ఆందోళన హింసాత్మకంగా మారింది. గాయపడినవారికి ఉత్తమమైన వైద్యం అందించడానికి సిద్ధంగా ఉండాలని ఆయన ఆస్పత్రులను కోరారు. పోలీసులతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆయన ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులకు సూచించారు. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు వెంటనే చేరుకోవాలని చెప్పారు. 

click me!