ఏప్రిల్ 25 నుంచి కేదార్‌నాథ్ యాత్ర ప్రారంభం.. కొత్త మార్గదర్శకాలు జారీ

By Mahesh Rajamoni  |  First Published Apr 19, 2023, 7:58 PM IST

Kedarnath Yatra 2023: ఏప్రిల్ 25 నుంచి కేదార్ నాథ్ యాత్ర 2023 ప్రారంభం కానుంది. యాత్ర నేప‌థ్యంలో ప్రభుత్వం కొత్త మార్గ‌ద‌ర్శకాలు జారీ చేసింది. యాత్ర మార్గంలో 22 మంది వైద్యులు, అంతే సంఖ్యలో ఫార్మసిస్టులను నియమించడంతో యాత్రికులకు ఈసారి మెరుగైన వైద్యం లభిస్తుందని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.
 


Kedarnath Yatra 2023 to commence on April 25: ఏప్రిల్ 22న అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. అయితే కేదార్ నాథ్ ఆలయం 2023 ఏప్రిల్ 25న భక్తుల కోసం తెరుచుకోనుంది. ఏప్రిల్ 25న ఉదయం 6.20 గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. ఉత్తరాఖండ్ లోని హిమాలయ ఆలయానికి వార్షిక తీర్థయాత్ర ఏప్రిల్ 25న (మంగళవారం) ప్రారంభం కానున్న నేపథ్యంలో రోజుకు గరిష్టంగా 13,000 మంది యాత్రికులు కేదార్ నాథ్ ను సందర్శించవచ్చు. ప్రభుత్వం ఈసారి రోజువారీ పరిమితిని నిర్ణయించిందనీ, యాత్రికుల సౌలభ్యం కోసం టోకెన్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం) మయూర్ దీక్షిత్  మీడియాకు తెలిపారు. యాత్ర సజావుగా సాగేందుకు వీటితో పాటు తాము తీసుకున్న మ‌రిన్ని చ‌ర్య‌లు ఉపయోగపడతాయని డీఎం తెలిపారు. రానున్న యాత్ర ఏర్పాట్లను పరిశీలించిన దీక్షిత్, రుద్రప్రయాగ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) విశాఖ అశోక్ భదానే సంయుక్తంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత వివ‌రాలు వెల్ల‌డించారు. 

కేదార్ నాథ్ యాత్రలో వైద్య సౌకర్యాలు..

Latest Videos

undefined

యాత్రా మార్గంలో 22 మంది వైద్యులు, అంతే సంఖ్యలో ఫార్మసిస్టులను నియమించడంతో యాత్రికులకు ఈసారి మెరుగైన వైద్యసేవలు అందనున్నాయి. వీరిలో ముగ్గురు వైద్యులు, ఇద్దరు ఆర్థోపెడిక్ సర్జన్లు ఉంటారని, దారి పొడవునా 12 మెడికల్ రిలీఫ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశామని దీక్షిత్ తెలిపారు. ఈ మార్గంలో ఆరు అంబులెన్సులను మోహరించామనీ, వీటిలో మూడింటిని రిజర్వ్ లో ఉంచామని, అత్యవసర పరిస్థితి కోసం ఎయిర్ అంబులెన్స్ ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.

ఇతర ఏర్పాట్ల గురించి వివ‌రిస్తూ.. 

యాత్ర మార్గాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను సులభ్ ఇంటర్నేషనల్ కు, ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను కేదార్ నాథ్ నగర పంచాయతీకి అప్పగించారు. సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ శాశ్వత మరుగుదొడ్లను నిర్మిస్తోందనీ, వ్యర్థాల నిర్వహణ కోసం ప్లాస్టిక్, వాటర్ బాటిళ్లకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. యాత్ర మార్గంలో గుర్రాలు, గాడిదలకు పశుసంవర్ధక శాఖ ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. యాత్రికులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి జల్ సంస్థాన్ సోన్ప్రయాగ్ నుండి కేదార్ నాథ్ ధామ్ వరకు తొమ్మిది వాటర్ ప్యూరిఫైయర్లను ఏర్పాటు చేసింది. గుప్తకాశి నుంచి బడీ లింకోలి వరకు గర్వాల్ మండల్ వికాస్ నిగమ్ (జీఎంవీఎన్) అతిథిగృహాల్లో 2,500 మందికి వసతి కల్పించనున్నట్లు డీఎం తెలిపారు. కేదార్ నాథ్ ధామ్ లోని న్యూ ఘోడా పదవ్, హిమ్ లోక్ కాలనీలో 80 పడకలతో రెండు టెంట్ కాలనీలను ఏర్పాటు చేసి 1,600 మందికి వసతి కల్పించ‌నున్నారు.

యాత్రలోకి పోలీసు యంత్రాంగం..

యాత్రను పకడ్బందీగా నిర్వహించేందుకు 450 మంది పోలీసు అధికారులు, ఉద్యోగులను నియమించామని తెలిపారు.  బయటి రాష్ట్రాల నుంచి 150-200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. యాత్ర సందర్భంగా లాస్ట్ అండ్ ఫౌండ్ సెంటర్ ను కూడా నిర్వహించనున్నారు. వీటితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికుల కోసం వివిధ భాషల్లో సైన్ బోర్డులను సిద్ధం చేశారు. తీర్థయాత్ర సందర్భంగా తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అదనపు పార్కింగ్ స్థలాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

click me!