మమతా బెనర్జీ ర్యాలీకి కేసీఆర్ మిస్: చంద్రబాబు రెడీ

By pratap reddyFirst Published Jan 11, 2019, 10:23 AM IST
Highlights

కాంగ్రెసుతో జత కట్టేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. జనవరి 19వ తేదీ ర్యాలీలో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. దాంతో ఆహ్వానం అందినా కూడా ర్యాలీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదని అంటున్నారు.

హైదరాబాద్‌:  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమాల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ ఈ నెల 19వ తేదీన తలపెట్టిన ప్రతిపక్షాల ర్యాలీకి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గైర్హాజరయ్యే అవకాశం ఉంది. ఆయనకు మమతా బెనర్జీ ఆహ్వానం పంపించారా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు.

కాంగ్రెసుతో జత కట్టేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. జనవరి 19వ తేదీ ర్యాలీలో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా పాల్గొనే అవకాశం ఉంది. దాంతో ఆహ్వానం అందినా కూడా ర్యాలీకి కేసీఆర్ హాజరయ్యే అవకాశం లేదని అంటున్నారు. కాంగ్రెసు, బిజెపిలు లేని జాతీయ ఫ్రంట్ ను కేసీఆర్ కోరుతున్నారు.

కాంగ్రెసుకు మిగతా పార్టీల నుంచి కూడా కొంత వ్యతిరేకత ఎదురవుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులకు బిఎస్పీ, ఎస్పీ సిద్ధపడుతున్నాయి. కాంగ్రెసుకు ఆ రెండు పార్టీలు కూడా దూరంగా ఉండే అవకాశం ఉంది. అదే సమయంలో తాము కాంగ్రెసుతో గానీ బిజెపితో గానీ జత కట్టే అవకాశం లేదని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. దాంతో కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు పెరుగుతోందని భావిస్తున్నారు. 

కేసీఆర్ ఇటీవల మమతా బెనర్జీని రెండోసారి కలిశారు. అయితే, కాంగ్రెసును ఫెడరల్ ఫ్రంట్ నుంచి మినహాయించడాన్ని మమతా బెనర్జీ అంగీకరించలేదని అంటున్నారు. 

ఇదిలావుంటే, జనవరి 19వ తేదీన మమతా బెనర్జీ తలపెట్టిన ప్రతిపక్షాల ర్యాలీకి హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధపడ్డారు. కాంగ్రెసుతో కలిసి నడిచేందుకు చంద్రబాబు పూర్తి స్థాయిలో సిద్ధపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా లోకసభ ఎన్నికల్లోనూ కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. 

కాంగ్రెసుతో వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పొత్తుపై ఆ ర్యాలీలో స్పష్టత రావచ్చునని భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ఫ్రంట్ కు కూడా ఓ రూపం వస్తుందని చంద్రబాబు అనుకుంటున్నారు. 

click me!