పీఎస్‌ఎల్‌వీ సీ 15 ప్రయోగం విజయవంతం: ఇస్రోకు జగన్, కేసీఆర్ అభినందనలు

By Siva KodatiFirst Published Feb 28, 2021, 2:17 PM IST
Highlights

పీఎస్ఎల్‌వీ సీ 15 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌లు శాస్త్రవేత్తలను అభినందించారు

పీఎస్ఎల్‌వీ సీ 15 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రోపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌లు శాస్త్రవేత్తలను అభినందించారు.

ప్రపంచంలోనే అగ్రశ్రేణి అంతరిక్ష పరిశోధనా సంస్ధల్లో ఇస్రో ఒకటని కేసీఆర్ కొనియాడారు. ప్రైవేట్ వాణిజ్య ప్రయోగంతో ఇది మరోసారి నిరూపితమైందని సీఎం అన్నారు. పలు దేశాలు సాంకేతికత కోసం ఇస్రోను ఎంచుకోవడంతో మన ఖ్యాతి వర్ధిల్లుతోందని చంద్రశేఖర్ రావు చెప్పారు.  

కాగా, ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెజానియా-1తో పాటు 18 ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళుతోంది. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా విదేశీ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను భారత్‌ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం  నాలుగు దశలు విజయవంతమయ్యాయి.

అమెజానియా అమెజానియా-1తో పాటు 18 ప్రైవేటు ఉపగ్రహాలు అంతరిక్ష్య కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించాయి. ప్రయోగం విజయవంతమవడం పట్ల ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో చేసిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే కావడం విశేషం.

click me!